ఉచిత హామీలను ప్రకటించే పార్టీలను రద్దు చేయలేం

ఉచిత హామీలను ప్రకటించే పార్టీలను  రద్దు చేయలేం

న్యూఢిల్లీ: ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు.. రెండూ వేర్వేరు విషయాలని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు.. సంక్షేమ కార్యక్రమాల మధ్య సమతుల్యత సాధించాలని చెప్పింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని తోసిపుచ్చింది. ఈ విషయంలో సూచనలు ఇవ్వాలని స్టేక్ హోల్డర్లను ఆదేశించింది. ఉచిత హామీలను ఇచ్చే పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేసి, రిజిస్ట్రేషన్‌‌‌‌ను రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘం అమలు చేయాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌‌‌‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన బెంచ్ గురువారం విచారించింది. ‘‘రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయడం లాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మాకు ఇష్టంలేదు. ఇది అప్రజాస్వామికమైన ఆలోచన” అని జస్టిస్ రమణ అన్నారు.  జడ్జీలు కూడా చదవకముందే ఈసీ అఫిడవిట్లు న్యూస్ పేపర్లలో వస్తుండటంపైనా సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్థిక విపత్తుకు దారితీస్తది: సొలిసిటర్ జనరల్
“ఇటీవల కొన్ని పార్టీలు ఉచితాల పంపిణీని ఒక ‘కళ’ స్థాయికి పెంచాయి. సమాజ సంక్షేమానికి ఉచిత వస్తువుల పంపిణీ ఒక్కటే మార్గమని కొన్ని పార్టీలు అర్థం చేసుకోవడం దురదృష్టకరం. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఆర్థిక విపత్తుకు దారి తీస్తుంది” అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. 

లాయర్లు మాస్క్‌‌‌‌లు పెట్టుకోవాలి: సీజేఐ
కోర్టు రూముల్లో లాయర్లు మాస్క్‌‌‌‌లు పెట్టుకోవాలని లాయర్లను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. కోర్టు సిబ్బంది, జడ్జిలు కరోనా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన విషయమే, కానీ.. ఎన్నికల టైమ్​లో అడ్డగోలుగా ఉచిత హామీలు ఇవ్వడమనేది తీవ్రమైన విషయమేనని, కానీ శాసనవ్యవస్థలోకి జోక్యం చేసుకోలేమని సుప్రీం బెంచ్ చెప్పింది. ‘‘మాకు ఇష్టం లేదనో, సంప్రదాయవాదులమనో మీరు అనుకోవచ్చు. కానీ మేం లెజిస్లేటివ్ డొమైన్‌‌‌‌లోకి ప్రవేశించలేం. ఇది చాలా తీవ్రమైనది. చిన్న విషయం కాదు.. ఇతరులు ఏం చేబుతారనేది కూడా విందాం” అని అన్నారు. ‘‘సీనియర్ లాయర్లు కొన్ని సూచనలు ఇచ్చారు. నేను రిటైర్‌‌‌‌‌‌‌‌ అయ్యే లోపు మిగిలిన పక్షాలు కూడా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం’’ అని చెబుతూ విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు.