ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సమర్థించిన సుప్రీంకోర్టు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సమర్థించిన సుప్రీంకోర్టు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమే అని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లపై 3:2తో తీర్పు వెలువరించింది. 10శాతం కోటాను జస్టిస్‌ దినేశ్ మహేశ్వరి, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేబీ పార్దివాలా సమర్థించగా.. సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ఇతరుల పట్ల వివక్షచూపడం కాదని, ఈ కోటాతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వచ్చిన నష్టమేమీలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న రాజ్యాంగ నిబంధనల్ని ఈడబ్ల్యూఎస్ కోటా అతిక్రమించడంలేదని స్పష్టం చేసింది. 

న్యాయమూర్తులు ఏమన్నారంటే..

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ దినేశ్ మహేశ్వరి తీర్పు వెలువరించారు. ఇవి సమానత్వ కోడ్ ను ఉల్లంఘించడంలేదని, 50శాతం రిజర్వేషన్ల పరిమితి ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదని అభిప్రాయపడ్డారు. ఇక రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వివక్ష లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. వీరి తీర్పులతో జస్టిస్ బేబీ పార్దీవాలా ఏకీభవించారు. కానీ జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం 10శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఇలా చేయడం ద్వారా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50శాతం పరిమితిని ఉల్లంఘించినట్లవుతుందని స్పష్టం చేశారు. సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ సైతం భట్ తీర్పుతో ఏకీభవించారు. 

ఏంటీ వివాదం?

2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. రిజర్వేషన్లపై 1992 సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం నిర్ణయం ఇది రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘిస్తోందని వాటిలో పేర్కొన్నారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.