
న్యూఢిల్లీ : దేశంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 -22 విద్యా సంవత్సరంలో 1,456 మెడికల్ సీట్లు మిగిలిపోయాయి. అయితే వాటిని భర్తీ చేసేందుకు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దేశంలో వైద్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల అవసరం ఉందన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు భర్తీ చేయకపోవడంపై మండిపడింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేని పక్షంలో వారికి పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కోర్టుకు హాజరుకావాలని, వారి సమక్షంలోనే ఆదేశాలుజారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.