మదర్సా యాక్ట్​పై సుప్రీం స్టే

మదర్సా యాక్ట్​పై సుప్రీం స్టే

న్యూఢిల్లీ :  సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్​లోని సుమారు 17 లక్షల మదర్సాల స్టూడెంట్లకు ఊరట కల్పించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శుక్రవారం స్టే విధించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 16 వేల మదర్సాలు యథావిధిగా కొనసాగనున్నాయి. సీజేఐ​ జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్..​ అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రాథమికంగా సరైంది కాదని పేర్కొంటూ యూపీ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, మదర్సా బోర్డుకు నోటీసులు జారీ చేసింది. 2004 నాటి చట్టం.. సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘించే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని గత నెలలో హైకోర్టు ప్రకటించింది. 

మదర్సా విద్యార్థులకు సాధారణ విద్యావిధానంలో వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మదర్సా బోర్డు లక్ష్యాలు నియంత్రణ స్వభావం కలిగి ఉన్నప్పటికీ.. బోర్డు సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం దానిని నిలిపివేసింది. ఇది 17 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తుందని, విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే అవసరంలేదని తాము భావిస్తున్నట్టు సీజేఐ పేర్కొన్నారు.

 మదర్సాలు మ్యాథ్స్, సైన్స్, చరిత్ర, భాషల వంటి ప్రధాన సబ్జెక్టుల్లో లౌకిక విద్యను అందించడమే పిల్​ ఉద్దేశం అయితే.. మదర్సా చట్టం 2004లోని నిబంధనలను రద్దు చేయడం పరిష్కారం కాదని సూచించారు. కాగా, సుప్రీం కోర్టులో హైకోర్టు తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాయి. అనుమానిత మతం, ఇతర సంబంధిత అంశాలపై చర్చ జరగాలని కేంద్రం పేర్కొంది. మదర్సాల తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. మతపరమైన విద్య అంటే మతపరమైన బోధన కాదని, హైకోర్టు ఆదేశంతో 10 వేల మంది మదర్సాల టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. కాగా, ఈ అంశాలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొంటూ.. తదుపరి విచారణ జులై రెండో వారానికి వాయిదా వేశారు.