ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్దం: సుప్రీం కోర్టు

ఎలక్టోరల్ బాండ్లు  రాజ్యాంగ విరుద్దం: సుప్రీం కోర్టు
  • వాటితో క్విడ్ ప్రోకో జరిగే అవకాశం
  • బ్లాక్ మనీని అరికట్టేందుకు వేరే మార్గాలున్నాయ్
  • ఇది సమాచార హక్కును ఉల్లంఘన కూడా..
  • బాండ్ల జారీని ఎస్బీఐ తక్షణమే నిలిపేయాలి
  •  సుప్రీం కోర్టు సంచనల తీర్పు

ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది.  వీటి జారీని ఎస్బీఐ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ ఏకగీవ్ర తీర్పునిచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు పరిష్కారం కాదని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా క్విడ్ ప్రోకో‌కు అవకాశం ఉందని వివరించింది. ఇది ఆర్టిక‌ల్ 19(ఏ)(ఏ) ప్ర‌కారం స‌మాచార హ‌క్కును ఉల్లంఘించిన‌ట్లు అవుతుందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం రెండు విధాలుగా ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఒక పార్టీకి మద్దతుగా అందించే విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీసే అవకాశం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే మార్గంకాదని, ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.

 కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు, సీపీఎం , ఎన్‌జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  దాఖలు చేసిన నాలుగు వేర్వేరు పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ కేసు విచారణ ఇదివరకే పూర్తయినప్పటికీ తీర్పును రిజర్వ్ చేస్తూ నవంబర్ 2న కోర్ట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ తీర్పు వెల్లడించింది.  మార్చి 6 లోగా ఎలక్టోరల్ బాండ్స్ పై ఎన్నికల కమిషన్ కు ఎస్బీఐ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని తెలిపింది. సమాచారం అందిన వారం లోపు అన్ని వివరాలను పబ్లిక్ వెబ్ సైట్ లో ఉంచాలని ఈసీకి సూచించింది. 15 రోజుల వ్యవధిలో ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ ను కొనుగోలు దారులకు రాజకీయపార్టీలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.