ఆధార్​, ఓటర్​ కార్డు లింక్ ​చట్టంపై..ఇయ్యాల సుప్రీంలో విచారణ

ఆధార్​, ఓటర్​ కార్డు లింక్ ​చట్టంపై..ఇయ్యాల సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: ఆధార్​, ఓటర్​ ఐడీ కార్డును లింక్​ చేసే వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్​ సీనియర్​ నేత రణదీప్​ సుర్జేవాలా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై సోమవారం విచారణ జరగనుంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తుల గోప్యతతో పాటు సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు.  పార్లమెంట్​లో ఎలాంటి డిబేట్​ పెట్టకుండా బిల్లును పాస్​ చేసిందని తెలిపారు. ఎన్నికల సంస్కరణ ప్రక్రియలో భాగంగా.. ఎలక్షన్​ కమిషన్​ ఆధార్​, ఓటర్​ ఐడీ ప్రాజెక్టును ప్రారంభించిందని వివరించారు. ఆధార్​, ఓటర్​ కార్డు లింక్​ చేస్తే ఇండియన్​ సిటిజన్స్​ కానివారు కూడా ఓటు వేస్తారని తెలిపారు. కాంగ్రెస్​ డీఎంకే, ఎన్​సీపీ, తృణమూల్​ కాంగ్రెస్​, శివసేనతో పాటు బీఎస్​పీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా.. టీఎంసీ ఎంపీ డెరెక్​ ఒబెరాయ్​ రాజ్యసభ చైర్​పైకి రూల్​ బుక్​ విసిరారని ఆరోపిస్తూ.. ఆయనను సస్పెండ్​ చేశారని గుర్తు చేశారు. ఆధార్​ అనేది.. రెసిడెంట్​ ప్రూఫ్​అని, సిటిజన్​షిప్​ కాదని కాంగ్రెస్​ఎంపీ శశిథరూర్​ స్పష్టం చేశారు. 

లింక్​ తప్పనిసరి కాదన్న కేంద్ర మంత్రి
సుప్రీం కోర్టు గోప్యతా హక్కు తీర్పు ప్రకారం.. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ లింక్​ స్వచ్ఛందంగా ఉంటుందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు నొక్కి చెప్పారు. ఇది తప్పనిసరి కాదన్నారు. ఆధార్​ కార్డు లేకపోయినా.. ఓటర్​ జాబితా నుంచి అతని పేరు తొలగించబడదని తెలిపారు.