
రూ. 500, 1,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను రేపు (సెప్టెంబరు 28న) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తిరిగి సమగ్ర విచారణ చేపట్టబోయే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనాలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోన్న నేపథ్యంలో నోట్ల రద్దుపై విచారణను కూడా దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూడవచ్చు.
నవంబర్ 8, 2016న జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసిన ప్రధాని మోడీ... అప్పట్లో చలామణిలో ఉన్న రూ. 500, 1,000 నోట్లను ఇకపై ఎలాంటి లావాదేవీలకు ఉపయోగించలేమని ప్రకటించారు . నల్లధన నిర్మూలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆకస్మాత్తుగా నోట్ల రద్దు ప్రకటన వెలువడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దేశంలోని బ్యాంకుల, ఏటీఎంల ముందు పెద్ద ఎత్తున క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా రూ. 500, రూ. 2000, రూ. 200 నోట్లను రిలీజ్ చేసింది.