ఉచిత పథకాల హామీలపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఉచిత పథకాల హామీలపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఉచిత హామీల అంశాన్ని పార్లమెంట్​లో చర్చిస్తారని మీరు భావిస్తున్నారా? అయితే.. ఏ పార్టీ చర్చిస్తుంది? ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు. కానీ, ట్యాక్స్ ​పేయర్స్​, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన  అవసరం ఉంది.
‑ ఈ అంశాన్ని పార్లమెంట్​కు వదిలేయాలన్న అడ్వకేట్​ కపిల్​ సిబల్ కామెంట్స్​పై సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు, ప్రకటనల కట్టడిపై అధ్యయనం కోసం ఎక్స్​పర్ట్స్​ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కమిటీలో నీతి ఆయోగ్​, ఫైనాన్స్​ కమిషన్​, అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఆర్బీఐకి చోటు కల్పించాలని పేర్కొంది. ఉచితాలను ఎలా కంట్రోల్​ చేయొచ్చో కమిటీ సూచనలు చేస్తుందని తెలిపింది. సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్​ ఈ మేరకు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఉచిత హామీల వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, వీటిని అదుపు చేయడంపై  కమిటీ స్టడీ చేసి కేంద్రానికి, ఎలక్షన్​ కమిషన్​కు, సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ ఏర్పాటుపై ఏడు రోజుల్లో తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రాన్ని, ఈసీని, సీనియర్​ అడ్వకేట్​, రాజ్యసభ సభ్యుడు కపిల్​ సిబల్​ను,  పిటిషనర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇష్టారీతి ఉచిత హామీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పేనని కేంద్రం తరఫున సొలిసిటర్​  జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిని పార్లమెంట్​కు వదిలేయాలని, అక్కడ చర్చించి చట్టాన్ని తేవొచ్చని సీనియర్​ అడ్వకేట్​ కపిల్​ సిబల్​ అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘‘ఉచిత హామీల అంశాన్ని పార్లమెంట్​లో చర్చిస్తారని మీరు భావిస్తున్నారా? అయితే.. ఏ పార్టీ చర్చిస్తుంది? ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు. ట్యాక్స్​పేయర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన  అవసరం ఉంది” అని స్పష్టం చేశారు.