
ఇండియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేకు ఇప్పటికే ఐదుగురు స్టార్ ఆసీస్ ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే ఆసీస్ జట్టులో స్థానం కోల్పోయి దేశవాళీ క్రికెట్ లో వరుస సెంచరీలతో హోరెత్తించిన మార్నస్ లాబుస్చాగ్నేను గ్రీన్ స్థానంలో వన్డే సిరీస్‌కు జట్టులో చేర్చనున్నట్లు ఆసీస్ బోర్డు శుక్రవారం (అక్టోబర్ 17) ప్రకటించింది.
ఇంగ్లిస్ కు గాయం, వ్యక్తిగత కారణాలతో జంపా:
స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ సేవలను ఆసీస్ జట్టు కోల్పోనుంది. జంపా భార్య బిడ్డను జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలో జంపా తండ్రి కాబోతున్నాడు. ఈ కారణంగా ఈ ఆసీస్ స్టార్ స్పిన్నర్ తొలి వన్డేలో ఆడడం లేదు. అయితే సిరీస్ లోని చివరి రెండు వన్డేలకు జంపా అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. జంపా స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్ ను జట్టులోకి తీసుకున్నారు. మాథ్యూ కుహ్నెమాన్ కు తొలి వన్డేలో ప్లేయింగ్ 11 చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
మరోవైపు జోష్ ఇంగ్లిస్ ఇంకా గాయం పూర్తిగా కోలుకోలేదు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోనూ ఈ ఆసీస్ వికెట్ కీపర్ గాయం కారణంగా టీ20 సిరీస్ ఆడలేదు. అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరిగే రెండవ వన్డేలో కూడా ఇంగ్లిస్ ఆడబోయేది అనుమానంగా మారింది. అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్న మూడో వన్డేకు ఇంగ్లిస్ ఫిట్‌గా ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది. ఇంగ్లిస్ స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ జోష్ ఫిలిప్‌ను జట్టులోకి చేర్చుకుంది.
కమ్మిన్స్, మ్యాక్స్ వెల్ తో పాటు క్యారీ దూరం:
ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. నవంబర్ నుంచి సొంతగడ్డపై జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇండియాతో వన్డే సిరీస్ కు కమ్మిన్స్ దూరం కావడంతో వన్డేల్లో అతని స్థానంలో మిచెల్ మార్ష్.. టెస్టుల్లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేపట్టనున్నారు. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ తర్వాత కమ్మిన్స్ గాయపడ్డాడు.
ఆసీస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియాతో వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇండియాతో సిరీస్ కు ముందు న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఈ విధ్వంసకర బ్యాటర్ తొలి టీ20కు ముందు గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో మిచెల్ ఓవెన్ (Mitchell Owen) కొట్టిన బంతి మ్యాక్స్‌వెల్ ముంజేతిని బలంగా తాకడంతో అతని ఎముక విరిగింది. దీంతో కివీస్ తో పాటు ఇండియా సిరీస్ కు దూరమయ్యాడు. ఇక వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చిన్న గాయం కారణంగా తొలి వన్డేకు మాత్రమే దూరమవుతున్నాడు. రెండో వన్డేకు అందుబాటులో ఉంటాడు.
ఇండియాతో తొలి వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
రెండు, మూడు వన్డేలకు: ఆడమ్ జంపా , అలెక్స్ కారీ , జోష్ ఇంగ్లిస్