యెస్ బ్యాంక్ బాండ్‌హోల్డర్లకు భారీ ఊరట: రూ. 8వేల 400 కోట్లు చెల్లించమని సుప్రీంకోర్టు ఆదేశం

యెస్ బ్యాంక్ బాండ్‌హోల్డర్లకు భారీ ఊరట: రూ. 8వేల 400 కోట్లు చెల్లించమని సుప్రీంకోర్టు ఆదేశం

భారత బ్యాంకింగ్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించిన యెస్ బ్యాంక్ ఏటీ-1 బాండ్ల జారీ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో బాండ్‌హోల్డర్లకు ఊరట లభించగా.. బ్యాంక్ షేర్లు మాత్రం ఒక్కసారిగా కుప్పకూలాయి. 

వాస్తవానికి 2020 మార్చిలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు RBI ఒక పునర్నిర్మాణ ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ సంక్షోభ సమయంలో బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ సుమారు 8వేల 415 కోట్ల రూపాయల విలువైన అదనపు టైర్-1 బాండ్లను ఎలాంటి పరిహారం చెల్లించకుండా పూర్తిగా రద్దు చేశారు. అయితే ఈ బాండ్లు ఎలాంటి మెచ్యూరిటీ తేదీ లేని ప్రత్యేకమైన రుణ సాధనాలు కావడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఫైనల్ రీస్టక్చరింగ్ ప్లాన్ లో వీటిని రద్దు చేసే నిబంధనే లేదని బాండ్‌హోల్డర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. సుప్రీంకోర్టు తాజాగా ఆ బాండ్ల రద్దు నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని, ఏకపక్షమని తేల్చిచెప్పింది. యెస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌కు ఈ బాండ్లను రద్దు చేసే అధికారం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. అప్పుడు చెప్పినట్లుగా 9 శాతం, 9.5 శాతం వడ్డీతో అసలును బాండ్‌హోల్డర్లకు చెల్లించాలని ఆదేశించింది. బాండ్‌హోల్డర్ల కోణంలో చూస్తే ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే.. బాండ్లు కొనుగోలు చేసి తమ డబ్బు కోల్పోయామని ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లకు ఈ తీర్పు ద్వారా పూర్తి న్యాయం జరిగింది.

►ALSO READ | ఎల్‌నినో ఎఫెక్ట్: దోశ, ఇడ్లీ, మీల్స్ రేట్లు 15% పెంచుతున్న హోటల్స్!

అయితే ఈ తీర్పు యెస్ బ్యాంక్ షేర్లు హోల్డ్ చేస్తున్న మదుపర్లను మాత్రం తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 15 శాతం క్షీణించి రూ.18.02 వద్ద ట్రేడయ్యాయి. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం బ్యాంక్‌పై పడిన అదనపు ఆర్థిక భారమే. సుమారు 8,400 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అలాగే దీనిపై వర్తించే వడ్డీని చెల్లించాల్సి రావడం బ్యాంక్ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(SMBC) యెస్ బ్యాంక్‌లో 25 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ అదనపు బాధ్యత తెరపైకి రావడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కారణం అయ్యింది.

ఈ వ్యవహారంలో కోర్టు బాండ్ హోల్డర్లను మోసం చేసి వీటిని అండగట్టిన విషయాన్ని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంది. బాండ్స్ ఇష్యూలో ఉన్న నిబంధనల కంటే జరిగిన మోసం, బాండ్ హోల్డర్ల వ్యధను ప్రధానంగా కోర్టు పరిగణలోకి తీసుకోవటంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.