బీహార్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు.. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు తీర్పు

బీహార్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు.. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
  • నేర వ్యవస్థలోనే ఇలాంటి కేసును చూడలేదన్న బెంచ్

న్యూఢిల్లీ: ఇరవై ఎనిమిద ఏండ్ల కింది జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరిని ప్రభునాథ్​ సింగ్ కాల్చి చంపేశాడు. ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్.. కింది కోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద ప్రభునాథ్​ను దోషిగా నిర్ధారించింది. శిక్షను అమలు చేయాలంటూ శుక్రవారం తుది తీర్పునిచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా అందించాలని బీహార్ సర్కారును ఆదేశించింది. నేర వ్యవస్థలోనే ఇలాంటి కేసు ఎన్నడూ చూడలేదని కోర్టు పేర్కొంది. 

ఓటు వేయలేదని ఇద్దరిని చంపిండు

ప్రభునాథ్ సింగ్ 1985 నుంచి 1995 వరకు రెండుసార్లు మస్రఖ్ అసెంబ్లీ సెగ్మెంట్​ ఎమ్మెల్యేగా, 1998 నుంచి 2009 వరకు మూడుసార్లు మహారాజ్‌గంజ్ ఎంపీగా పనిచేశారు. ఆపై 2013లో జరిగిన ఉప ఎన్నికలోనూ గెలిచి 2014 వరకు ఎంపీగా కొనసాగారు. 1995లో బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సరన్ జిల్లా చప్రా నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ప్రభునాథ్.. తనకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఇద్దరిని కాల్చి చంపేశాడు. ఈ  కేసులో 2008 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు, 2012లో పాట్నా హైకోర్టు ప్రభునాథ్​ను నిర్దోషిగా తేల్చాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టుకు వెళ్లగా ప్రభునాథ్ దోషి అని తీర్పు వచ్చింది.