అదానీ-హిండెన్​బర్గ్​ వివాదం..సెబీ రూటు రైటే!

అదానీ-హిండెన్​బర్గ్​ వివాదం..సెబీ రూటు రైటే!
  •     అదానీ-–హిండెన్​బర్గ్​ వివాదం..సెబీ రూటు రైటే!
  •     దాని విచారణలో జోక్యం చేసుకోలేం
  •     సిట్​ దర్యాప్తు అవసరం లేదు
  •     మిగిలిన దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయండి
  •     సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కార్పొరేట్ కంపెనీ స్టాక్ ధరల ను తారుమారు చేసిందనే ఆరోపణలపై, అదానీ–-హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)​ బదిలీ చేయడానికి  నిరాకరించింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణను మూడు నెలల్లో  పూర్తి చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది.  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)    విధానాలపై కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.  

అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఆరోపణలపై సెబీ 24 అంశాల్లో ఇది వరకే 22 పూర్తి చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. సెబీ తరపున సొలిసిటర్ జనరల్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రెండు దర్యాప్తులను మూడు నెలల్లో  చేయాలని సెబీని ఆదేశిస్తున్నామని న్యాయమూర్తులు జెబి పార్దివాలా,  మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుల్లో సెబీ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్  ఇచ్చిన నివేదికను తోసిపుచ్చింది.

  ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ ఆరోపణలు, మీడియా కథనాల ఆధారంగా సిట్​దర్యాప్తునకు ఆదేశించడం సాధ్యం కాదని బెంచ్ పేర్కొంది.    "  దర్యాప్తును సిట్​కు బదిలీ చేయడానికి ఎలాంటి కారణాలూ కనిపించడం లేదు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఒక ఏజెన్సీ నిర్వహిస్తున్న దర్యాప్తును సిట్ లేదా సీబీఐకి బదిలీ చేస్తాం. అలాంటి అధికారాన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తాం ’’ అని బెంచ్ పేర్కొంది. 

అనుచిత ప్రయోజనం లేదు...

ఈ వివాదంపై విచారణ కోసం కోర్టు నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరికి "అనుచిత ప్రయోజనాలు" ఉన్నాయన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ ఆరోపణ నిరాధారమైనదని స్పష్టం చేసింది. ఫారిన్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐ,  లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌‌‌‌‌‌‌‌క్లోజర్ రిక్వైర్‌‌‌‌‌‌‌‌మెంట్స్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఓడిఆర్) నిబంధనలకు చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని సెబీని ఆదేశించడానికి  సరైన కారణాలు లేవని పేర్కొంది. నిబంధనలను రూపొందించడంలో సెబీని నియంత్రించడానికి తమకు పరిమిత అధికారమే ఉందని బెంచ్ పేర్కొంది. నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం,  సెబీ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపింది.

  హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా మోసపూరిత లావాదేవీలు,  షేర్-ధరల తారుమారు వంటి ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ స్టాక్‌‌‌‌‌‌‌‌లు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దెబ్బతిన్నాయి.  ఈ అంశంపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు కోరింది.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.  అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని, నియంత్రణ వైఫల్యం లేదని కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మేలో ఒక మధ్యంతర నివేదికలో పేర్కొంది.  

భారీగా పెరిగిన అదానీ స్టాక్స్​

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా పెరిగా యి. అదానీ ఎనర్జీ దాదాపు 12 శాతం ఎగబాకగా, అదానీ టోటల్ 10 శాతం పెరిగింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 11.60 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 9.84 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6 శాతం, అదానీ పవర్ 4.99 శాతం పెరిగాయి. అదానీ విల్మార్  షేర్లు 3.97 శాతం పెరగగా, ఎన్‌‌‌‌‌‌‌‌డీటిటీ 3.66శాతం, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ 2.45 శాతం, అదానీ పోర్ట్స్ 1.39 శాతం, అంబుజా సిమెంట్స్ 0.94 శాతం, ఎసీసీ 0.10 శాతం దూసుకెళ్లాయి.  మొత్తం 10 గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ రూ.15,11,073.97 కోట్లుగా ఉంది. 

 సత్యమేవ జయతే! సుప్రీం కోర్టు తీర్పు ఇదే విషయాన్ని చెప్పింది. మా వెంట నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండియా వృద్ధికి మా సహకారం కొనసాగుతుంది. జైహింద్​!..  గౌతమ్​ అదానీ