స‌ర్‌పై సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

స‌ర్‌పై సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చెంపపెట్టు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు పదేపదే చేస్తున్న దుష్ప్రచారానికి ఈ తీర్పుతో తెరపడిందని ఆయన పేర్కొన్నారు.

బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతోనైనా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని లక్ష్మణ్ హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ, ప్రక్షాళన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదేనని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు.