
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగితే మొత్తం సర్ ప్రక్రియను రద్దు చేస్తామని ఈసీని హెచ్చరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సోమవారం (సెప్టెంబర్ 15) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్లో ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగితే మొత్తం సర్ ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఎన్నికల సంఘం బీహార్ సర్ ప్రక్రియలో చట్టం, తప్పనిసరి నియమాలను పాటిస్తుందని తాము భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. బీహార్ సర్ ప్రక్రియపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. తుది తీర్పు దేశవ్యాప్త సర్ ప్రక్రియకు వర్తిస్తుందని పేర్కొంది.
►ALSO READ | అడ్రస్ మారిపోయిన అమీర్‌పేట్, టోలీచౌకీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు.. ఎక్కడికంటే...?
బీహార్ సర్ ప్రక్రియలో 12వ నిర్దేశిత పత్రంగా ఆధార్ కార్డును చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2025, సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆధార్ కార్డులను నకిలీ చేయొచ్చన్న ఈసీ వాదలను ఈసీ కొట్టిపారేసింది. ఒక్క ఆధార్ కార్డునే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులను కూడా నకిలీ చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ కార్డును పౌరసత్వ గుర్తింపుగా కాకుండా సర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు పత్రంగా స్వీకరించాల్సిందేనని ధర్మాసనం మరోసారి తేల్చిచెప్పింది. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను 2025, అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.