
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తీర్పు వెలువరించే సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని.. ఆలస్యం జరిగే కొద్ది ఫిరాయింపుదారులు ప్రయోజనం పొందుతారని.. ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్‌ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రెటరీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. 2025, ఏప్రిల్ 3న 8వారాలకు తీర్పు రిజర్వ్ చేసింది. 2025, జూలై 31న ఈ కేసులో తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తెలంగాణ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.