ఏసీబీకి చిక్కిన సూరారం సీఐ

ఏసీబీకి చిక్కిన సూరారం సీఐ
  •     రౌడీషీట్​ ఓపెన్​ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్​

జీడిమెట్ల, వెలుగు : రౌడీ షీట్​ఓపెన్ చేయ కుండా ఉండేందుకు లంచం డిమాండ్​ చేసిన మేడ్చల్​ జిల్లా సూరారం సీఐ వెంకటేశం రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్ల కథనం ప్రకారం.. మేడ్చల్​ జిల్లా గాజుల రామారానికి చెందిన రత్నాకరం సాయిరాజుపై గతంలో ఓ స్థల వివాదంలో కేసు నమోదైంది. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేం దుకు సూరారం సీఐ ఆకుల వెంకటేశం రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.2 లక్షలు ఇచ్చేందుకు రత్నాకరం సాయిరాజు అంగీకరిం చాడు. 

రెండు విడతల్లో లక్ష చొప్పున సీఐకి లంచంగా ఇచ్చాడు. అయితే ఇటీవల ఆ స్థలంలో అభివృద్ధి పనులు చేసుకుంటున్న రత్నాకరం సాయిరాజు వద్దకు వచ్చిన సీఐ మరో రూ.5లక్షల డిమాండ్ ​చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే పనులను అడ్డుకుంటానని, రౌడీషీట్​ ఓపెన్​ చేస్తానని బెదిరించాడు. విడతల వారీగా ఇస్తానని ఒప్పుకున్న రత్నాకరం సాయిరాజు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం సీఐ వెంకటేశంకు పోలీస్​స్టేషన్​లోనే రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్​జడ్జి ముందు హాజరుపరిచారు.  

రూ.70 వేలు తీసుకుంటూ ఆర్​ఐ

జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహసీల్దార్ ఆఫీసులో ఆర్ఐ ​సంగం  దుర్గయ్య శుక్రవారం ఓ రైతు నుంచి 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం...న్యాల్కల్​కు చెందిన హిప్పర్గావ్ మల్లప్పకు గతంలో ప్రభుత్వం 2.36 ఎకరాల అసైన్డ్ ​భూమిని కేటాయించింది. 

ఆ భూమి నిమ్జ్​ పరిధిలోకి రాగా, నష్టపరిహారం ఇప్పించేందుకు దుర్గయ్య రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఈనెల 11వ తేదీనన దుర్గయ్యకు రూ.30 వేలు ఇచ్చి తన దగ్గర ఇంకా డబ్బులు లేవని వేడుకున్నాడు. అయినా, మరో రూ.70 వేలు ఇస్తేనే చెక్కు ఇప్పిస్తానని దుర్గయ్య స్పష్టం చేశాడు. 

దీంతో మల్లప్ప ఈనెల14న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం దుర్గయ్యకు గంగ్వార్​ గ్రామం దగ్గర రూ. 70 వేలు ఇస్తుండగా ఏసీబీ రైడ్​చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంది. డబ్బులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.