డ్రగ్స్ కేసులో సురేఖా వాణి.. అషూరెడ్డి నంబర్లు

డ్రగ్స్ కేసులో సురేఖా వాణి.. అషూరెడ్డి నంబర్లు
  • వారి ఫోన్​లో వందల కాల్స్  
  • 12 మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు చెప్పిన నిందితుడు
  • ముగిసిన కస్టడీ.. రిపోర్టులో బయటపడ్డ కీలక వివరాలు

హైదరాబాద్‌, వెలుగు:‘కబాలి’  తెలుగు ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్‌ రాకెట్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీల డొంక కదులుతోంది. గోవా, హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు,  వ్యాపారస్తులు, పబ్ నిర్వాహకుల వివరాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన డ్రగ్స్‌ కేసులో..  కేపీ చౌదరిపై నిఘాపెట్టిన మాదాపూర్ ఎస్ వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్​పురాలో ఈ నెల 12న రాత్రి  అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పర్ పల్లి కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ పోలీసులు గురు, శుక్రవారాల్లో చౌదరిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.  అతడి మొబైల్ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ను డీ కోడ్ చేసి వాటి ఆధారంగా వివరాలు సేకరించారు.

18 మంది లిస్ట్‌లో ముగ్గురు సెలబ్రిటీలు

కేపీ చౌదరిని విచారించిన పోలీసులు 18 మంది లిస్ట్​ను గుర్తించారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు చౌదరి ఒప్పుకున్నాడు. ఇందులో 11 మందికి చెందిన ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ల వివరాలను పోలీసులు సేకరించారు. చౌదరి కాల్ లిస్ట్, వాట్సాప్​లో బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి, నటి సురేఖా వాణి, జ్యోతి ఫోన్ నంబర్లను గుర్తించారు. వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.  

6 నెలలుగా చౌదరితో టచ్​లో..

అషూరెడ్డి, సురేఖా వాణి, జ్యోతితో కేపీ చౌదరి వందల కాల్స్‌ మాట్లాడినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. వీరికి సంబంధించిన వివరాలను కేపీ చౌదరి వెల్లడించడం లేదన్నారు.  వీరంతా 6 నెలలుగా కేపీ చౌదరితో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. చౌదరి సెల్​ఫోన్​లోని సమాచారాన్ని డీకోడ్ చేయగా.. అతడు వాట్సాప్ డేటాను డిలీట్‌ చేసినట్లు తేలిందన్నారు. డేటాను డిలీట్‌ చేయడానికి గల కారణాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. అషూరెడ్డి, సురేఖా వాణి, జ్యోతితో మరో ముగ్గురిని అనుమానితులుగా మాత్రమే గుర్తించామన్నారు.   

డ్రగ్ పెడ్లర్ల పార్టీలు..

గత నెల 5న డ్రగ్స్ వాడుతూ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ పెడ్లర్ రఘుతేజతో కేపీ చౌదరికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పెడ్లర్లు చింతా రాకేశ్, శ్రీనివాస్ రెడ్డి నుంచి రఘుతేజకు డ్రగ్స్ అందినట్లు గతంలో సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే,  జూబ్లీహిల్స్​లోని స్నేహితా హిల్స్​కు చెందిన సిక్కిరెడ్డి కొన్ని పార్టీలు నిర్వహించిందని.. అందులో కొకైన్ వాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీల్లో కేపీ చౌదరితో పాటు సినీ సెలబ్రిటీలు, వ్యాపారస్తులు పాల్గొన్నట్లు సమాచారం.

 ఈ క్రమంలోనే కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు సంబంధించిన ఫోన్​నంబర్లను గుర్తించామని పోలీసులు చెప్పారు. గోవాలో పబ్‌, డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న చౌదరితో వీరంతా ఎందుకు అన్ని కాల్స్‌ మాట్లాడారనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. శుక్రవారంతో కేపీ చౌదరి కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ పోలీసులు అతడిని ఉప్పర్ పల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, కేపీ చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న కస్టమర్లు, పెడ్లర్స్
బెజవాడ భరత్‌, డ్రగ్ పెడ్లర్ చింతా రాకేశ్ రోషన్‌, అతడి భార్య సాయి ప్రసన్న, నల్ల రతన్ రెడ్డి, మోటూరి ఠాగూర్‌‌ ప్రసాద్, తేజ చౌదరి అలియాస్  రఘుతేజ, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్‌ రెడ్డి, నితినేశ్​, వంటేరు సవన్ రెడ్డి, వదనాల అనురూప్.
అనుమానితులు 
బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టులు  సురేఖా వాణి, జ్యోతి, సురేశ్ రాజ్, అనురాగ్, దీక్షయ్.