భద్రాద్రిలో తల్లీబిడ్డ మృతి ఘటనలో ట్విస్ట్.. శ్మశానంలో బయటపడ్డ సర్జికల్ కత్తెర!అసలేం జరిగింది.?

భద్రాద్రిలో తల్లీబిడ్డ మృతి ఘటనలో ట్విస్ట్.. శ్మశానంలో బయటపడ్డ సర్జికల్ కత్తెర!అసలేం జరిగింది.?

 వైద్యుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే.. వైద్యం చేయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం, ఓ తల్లిని, కడుపులోని పసికందును నిలువునా బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకల రేపుతోంది. 

గుండాల మండలం శెంబులగూడెం గ్రామానికి చెందిన 25 ఏళ్ల చాట్ల వనిజ గర్భిణీ. ప్రసవం కోసం ఆమెను కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు లేకపోవడంతో అక్కడే ఉన్న నర్సు వనిజకు ప్రసవం చేసింది. కానీ, తీవ్ర వికటించడంతో పురిటిలోనే ఆ పసికందు కన్నుమూసింది.

అంతటితో ఆగకుండా, ప్రసవం తర్వాత వనిజకు తీవ్ర రక్తస్రావం కావడం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసరంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వనిజ కూడా ప్రాణాలు విడిచింది. నమ్ముకున్న ఆసుపత్రే.. ఆ తల్లిని, బిడ్డను పొట్టనబెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి. 

అయితే వనిజ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. చితాభస్మం సేకరిస్తున్న సమయంలో బూడిదలో ఓ కత్తెర లభ్యమయింది. గర్భవతికి ఆపరేషన్ లేదా ప్రసవ సమయాల్లో వాడే సర్జికల్ కత్తెర శ్మశానంలో కాలిపోయిన శవంలో బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రసవం సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా కత్తెరెను వనిజ కడుపులోనే మర్చిపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కత్తెర వల్లే అంతలా రక్తస్రావం జరిగి వనిజ చనిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ దారుణంపై మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని బాధితులు హెచ్చరిస్తున్నారు.