Bakasura Restaurant: పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన 'బకాసుర రెస్టారెంట్‌': ఓటీటీలో హారర్ కామెడీ రికార్డ్!

Bakasura Restaurant: పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన 'బకాసుర రెస్టారెంట్‌': ఓటీటీలో హారర్ కామెడీ రికార్డ్!

కంటెంట్‌ బలంగా ఉంటే చాలు, పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. లేటెస్ట్ గా దానిని నిరూపిస్తూ ‘బకాసుర రెస్టారెంట్‌’ (Bakasura Restaurant) చిత్రం ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా థియేటర్ల కంటే ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్‌లోనే మరింతగా సక్సెస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇప్పుడు చిన్న సినిమాలు, కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలకు ఓటీటీ ఒక వరంలా మారింది. 

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డ్!

ఈ ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ హారర్ కామెడీ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దుమ్మురేపుతోంది. పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ కాస్టింగ్ ఉన్న చిత్రాల నడుమ, 'బకాసుర రెస్టారెంట్' ఏకంగా 24 రోజులుగా ప్రైమ్ ఇండియాలో టాప్ 10లో కొనసాగుతూ సంచలనం సృష్టించింది. కన్నప్ప, పరద, కూలి వంటి అంచనాలున్న సినిమాలను సైతం వెనక్కి నెట్టి, ఈ చిత్రం ఏకంగా 250 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిందంటే, ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కథాంశం ఏమిటంటే...

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో పరమేశ్వర్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ పాత్రలో లీడ్ రోల్ చేశాడు. అతడు తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్ పెట్టాలనే కోరికతో ఉంటాడు. డబ్బుల కోసం ఘోస్ట్ వీడియోలు చేసే క్రమంలో వారికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. అందులోని మంత్రపూజ కారణంగా, ఒక 200 ఏళ్ల నాటి ఆత్మ నిమ్మకాయలోకి ప్రవేశిస్తుంది. ఆ అత్యంత ఆకలితో ఉన్న ఆత్మ.. అనుకోకుండా వారి రూమ్‌కి వచ్చిన అంజిబాబు (ఫణి) శరీరంలోకి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. వైవా హర్ష పోషించిన బక్క సూరి పాత్ర చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మను ఎలా వదిలించుకున్నారనే అంశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, భయపెట్టాయి.

పెద్ద సినిమాల మధ్య నిలబడటం కష్టమనే అపోహను చెరిపేసిన ‘బకాసుర రెస్టారెంట్‌’, 'కంటెంట్ ఈజ్ కింగ్' అని మరోసారి నిరూపించింది. ప్రేక్షకులే స్వయంగా "సర్ప్రైజ్ ప్యాకేజ్" అని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో, ఈ చిన్న సినిమా ఓటీటీలో 'మస్ట్ వాచ్ మూవీ'గా రికార్డు సృష్టించింది.