
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో ప్రాణహిత నది వెంట రిటైర్డ్ ఇంజనీర్ విఠల్ రావు ఆధ్వర్యంలోని ఎస్వీ కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేస్తోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద 2008 డిసెంబర్ 16న అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ ఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో ముందుకెళ్లలేదు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దీన్ని మేడిగడ్డకు మార్పు చేసి నిర్మించింది. ఇది కుంగిపోవడంతో మరోసారి ప్రాణహిత ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.
మహారాష్ట్రతో ఎలాంటి వివాదాలు లేకుండా తుమ్మిడి హెట్టికి దిగువన రిజర్వాయర్ నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే సర్వే పనులు కొనసాగిస్తోంది. సర్వేకు ఇరిగేషన్ ఆఫీసర్లు సహకారం అందిస్తున్నారు. నది స్వభావం, స్థితి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లోతు వివరాలు నమోదు చేస్తున్నారు. తుమ్మిడి హెట్టి నుంచి దిగువన రణవెల్లి, భూరేపల్లి నుంచి కోర్సిని సమీప ప్రాంతాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. ఇద్దరు ఇంజనీర్లతో పాటు ఇరిగేషన్ ఏఈ ఉన్నారు. మహారాష్ట్ర వైపు ఉన్న గ్రామాలు, అడవి, అక్కడి భూముల వివరాలు ఆరా తీస్తున్నారు.
ప్రాజెక్ట్ పై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం: రిటైర్డ్ ఇంజనీర్ విఠల్ రావు
ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని రిటైర్డ్ ఇంజనీర్ విఠల్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం ఆధ్వర్యంలో దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రస్తుత సర్కార్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో మరోసారి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సర్వే చేయిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలతో సర్వే నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని పేర్కొన్నారు.
ప్రాణహిత నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 165 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు, ఎల్లంపల్లి నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సాగు నీరు అందించేలా సర్వేలో ప్లాన్ చేస్తున్నామని ఆయన వివరించారు. గతంలో నిర్మించిన 70 కిలోమీటర్ల పొడవైన కాల్వలను ఉపయోగంలోకి తీసుకొస్తే మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ ను రూ. 4,500 కోట్ల వ్యయంతో రెండేండ్లలో పూర్తి చేసి నీటిని అందించే చాన్స్ ఉందని పేర్కొన్నారు. సర్వేకు స్థానిక ఇరిగేషన్ అధికారుల సాయం తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్రతో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి దిశా నిర్దేశం చేసేలా నివేదిక ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.