మసీదు కాంప్లెక్స్​లో సర్వేపై స్టే ఇవ్వలేం : సుప్రీంకోర్టు వెల్లడి

మసీదు కాంప్లెక్స్​లో సర్వేపై స్టే ఇవ్వలేం : సుప్రీంకోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ  జన్మభూమికి సంబంధించిన మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గురువారం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించింది. శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో మసీదు నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.

సర్వే చేపట్టాలంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను పరిశీలించిన స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ 2022 డిసెంబర్‌‌లో ఆదేశాలు ఇవ్వగా ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది. విచారణ చేపట్టిన హైకోర్టు సర్వే చేపట్టేందుకు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరగా.. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.