హడావుడిగా నార్కట్‌పల్లి పెద్దచెరువు సర్వే

హడావుడిగా నార్కట్‌పల్లి పెద్దచెరువు సర్వే

ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లను ప్రస్తావించని ఆఫీసర్లు:

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పెద్దచెరువు సర్వేను ఆఫీసర్లు హడావుడిగా ముగించారు. 163 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు సర్వేను కేవలం మూడు రోజుల్లోనే కంప్లీట్‌ చేశారు. మొత్తం చెరువును సర్వే చేయడానికి కనీసం పది రోజులు పడుతుందని, అప్పటివరకు వివరాలు చెప్పబోమని ప్రకటించిన ఆఫీసర్లు కేవలం మూడు రోజుల్లో కంప్లీట్‌ చేయడమే కాకుండా, అసలు ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లను కనీసం ప్రస్తావించలేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫిర్యాదుతో సర్వే చేపట్టిన ఆఫీసర్లు మొత్తం 38.15 ఎకరాల్లోనే సర్వే రిపోర్ట్‌ ఇచ్చారు. కబ్జాకు గురవుతుందన్న భూమి గురించి రిపోర్టులో ప్రస్తావించలేదు. చెరువు పరిధిలోని 480, 481, 485, 550 సర్వే నంబర్‌లో ప్రభుత్వ, అసైన్డ్‌ ల్యాండ్‌ కబ్జా చేస్తున్నారని రైతులు గతంలో కోమటిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సర్వే నంబర్‌లలో 481లో ప్రభుత్వ భూమి రెండెకరాలు ఉంది. ఇందులో నుంచే వెంచర్‌కు వెళ్లేందుకు 60 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. దీని గురించి రిపోర్ట్​లో కనీస ప్రస్తావన లేదు. ఆ నాలుగు సర్వే నంబర్లలో అసైన్డ్‌ ల్యాండ్‌ ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. అలాగే 550 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి 80 ఎకరాల వరకు ఉంది. ఈ ల్యాండ్‌లోకి రైతులు పోయేందుకు దారి లేదని చెప్పి తాజాగా ఇదే సర్వే నంబర్‌ 481 భూమిలో నుంచి 20 ఫీట్ల రోడ్డు వేసుకోవచ్చని రెవెన్యూ ఆఫీసర్లు అనధికారికంగా పర్మిషన్‌ ఇచ్చారు. దీన్ని బట్టి రియల్టర్లు వేస్తున్న వెంచర్‌లోకి వెళ్లేందుకు అధికారులు పరోక్షంగా పర్మిషన్‌ ఇచ్చినట్టేనని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీ లింగోటంలోని హాసిని, వాసవి వెంచర్‌లో పది ఎకరాల ప్రభుత్వ ల్యాండ్‌ ఆక్రమణకు గురైనట్లు తేలినా, దానిపైన రిపోర్ట్ ఇప్పటి వరకు​ బయటపెట్టకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.