Asia Cup 2025 Final: నా డ్రెస్సింగ్ రూమ్‌లో 14 ఉన్నాయి.. వారే మాకు నిజమైన ట్రోఫీలు: సూర్య హార్ట్ టచింగ్ కామెంట్స్

Asia Cup 2025 Final: నా డ్రెస్సింగ్ రూమ్‌లో 14 ఉన్నాయి.. వారే మాకు నిజమైన ట్రోఫీలు: సూర్య హార్ట్ టచింగ్ కామెంట్స్

ఆసియా కప్ 2025 టైటిల్ ను టీమిండియా గెలుచుకుంది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన టీమిండియా తుది సమరంలోనూ అదే జోరును కొనసాగించి పాకిస్థాన్ ను మట్టి కురిపించింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ మెగా ఫైనల్లో   పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి రికార్డ్ స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ముందునుంచి ఊహించినట్టుగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. సూర్య కుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన  కాన్ఫరెన్స్ లో చేసిన హార్ట్ టచింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

టోర్నీ తీసుకునేందుకు నిరాకరించినందుకు సూర్య ఇలా చెప్పుకొచ్చాడు " నేను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఒక జట్టు ట్రోఫీ నిరాకరించడం చూడలేదు. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. కష్టపడి సాధించిన ట్రోఫీని ఒక ఛాంపియన్ జట్టు నిరాకరించడం కఠిన నిర్ణయమే. మేము టోర్నీ మొత్తం మంచి క్రికెట్ ఆడాము. మీరు నన్ను ట్రోఫీల గురించి అడిగితే, నా డ్రెస్సింగ్ రూమ్‌లో అలాంటివి 14 ఉన్నాయి. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నాకు నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణం అంతటా నేను నా జట్టుకు.. సిబ్బందికి పెద్ద అభిమానిని. ఈ టోర్నీలో వారే నిజమైన జ్ఞాపకాలు. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి". అని సూర్య అన్నాడు.

మ్యాచ్ తర్వాత ఏం జరిగిందంటే..? 

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ  నుంచి ఆసియా కప్ ట్రోఫీని, విన్నర్ మెడల్స్‌‌ను  అందుకునేందుకు ఇండియా ఒప్పుకోలేదు. దాంతో ప్రెజెంటేషన్ సెర్మనీలో రన్నరప్‌‌  పాక్‌‌ ప్లేయర్లకు మాత్రమే మెడల్స్‌‌ అందించారు. ఇతర గెస్టుల నుంచి తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీప్లేయర్ పురస్కారాలు అందుకున్నారు. ఇండియా టీమ్‌‌ ట్రోఫీ తీసుకోవడం లేదని ప్రెజెంటర్ సైమన్ ప్రకటించాడు. 

టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ: 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాధి జట్టు పొగరు దించింది. స్వల్ప టార్గెట్ లో పాకిస్థాన్ పోరాడడంతో టీమిండియా విజయం కోసం చివరి ఓవర్ వరకు శ్రమించాల్సి వచ్చింది. తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో ఒంటిచేత్తో  ఇండియాను గెలిపించాడు. సంజు శాంసన్ (24), దూబే (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకొని పాకిస్థాన్ ను భారీ స్కోర్ చేయకుండా చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.