
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసియా కప్ 2025 ఆడడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. 2025 జూన్ నెలలో సర్జరీ చేయించుకున్న సూర్య.. ఆసియా కప్ కు పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. కొన్ని రోజుల క్రితం బ్యాట్ పట్టి ప్రాక్టీస్ ప్రారంభించిన ఈ టీమిండియా టీ20 కెప్టెన్.. ఇటీవలే ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. సూర్య భారత జట్టును నడిపించనున్నాడు. అయితే ఇప్పుడు ఆసియా కప్ కు టీమిండియా వైస్ కెప్టెన్ ఎవరో అనే చర్చ మొదలయింది. సూర్యకు డిప్యూటీగా ప్రస్తుతం ముగ్గురు రేస్ లో ఉన్నారు.
హార్దిక్ పాండ్య:
ఈ మెగా టోర్నీకి భారత వైస్ కెప్టెన్సీలో రేస్ లో హార్దిక్ పాండ్య అందరికంటే ముందున్నాడని చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీనియర్ ప్లేయర్ పాండ్యనే. దీంతో యువ జట్టుకు వైస్ కెప్టెన్ గా హార్దిక్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత టీ20 జట్టును నడిపించిన అనుభవం పాండ్యకు ఉంది. ఐపీఎల్ లోనూ కెప్టెన్ గా హార్దిక్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. దీంతో ఎక్కువగా భారత వైస్ కెప్టెన్ పగ్గాలు హార్దిక్ పాండ్యకే దక్కవచ్చు.
శుభమాన్ గిల్:
ఇటీవలే టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కెప్టెన్ గా చాలా పరిణితి చూపించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించి ప్లే ఆఫ్స్ కు చేర్చాడు.ఇంగ్లాండ్ తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్ లో తన మార్క్ కెప్టెన్సీతో సిరీస్ 2-2 తో సమం చేశాడు. వన్డేల్లో వైస్ కెప్టెన్ గిల్.. ఆసియా కప్ లో టీ20 వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఏడాది కాలంగా గిల్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడకపోవడం మాంస గా మారనుంది.
అక్షర్ పటేల్:
ప్రస్తుతం అక్షర్ పటేల్ టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అక్షర్ ఇంగ్లాండ్ సిరీస్ లో సూర్యకు డిప్యూటీగా నియమించబడ్డాడు. ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. హార్దిక్, గిల్ లను కాదని అక్షర్ పటేల్ కు ఆసియా కప్ కెప్టెన్సీ అవకాశాలు లేకపోలేదు. భారత టీ20 జట్టులో అక్షర్ రెగ్యులర్ ప్లేయర్. జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో స్పిన్ ఆల్ రౌండర్ గా తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడు.
ఆసియా 2025 లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.