
ఆసియా కప్ లో ట్విస్టుల మీద ట్విస్టులు.. కాంట్రవర్సీలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే షేక్ హ్యాండ్ వివాదం కుదిపేసిన విషయం తెలిసిందే. పాక్ ప్లేయర్లకు.. టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై రేగిన దుమారం ఆల్మోస్ట్ చల్లబడింది. రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించకుంటే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హెచ్చరించడంతో.. తదుపరి పాక్-యూఏఈ మ్యాచ్ కు రిచీ రిచర్డ్ సన్ ను నియమిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది.
ఈ మ్యాటర్ సెటిల్ అయ్యింది అనుకునే లోపే మరో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. అది ఈ సారి ఇండియా నుంచి కావడం గమనార్హం. ఆసియా కప్ ఫైనల్ తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ విషయంలో సూర్య కుమార్ యాదవ్ పెట్టిన కండిషన్ ఇప్పుడు ఆసియా కప్ నిర్వాహకులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆసియా కప్ చీఫ్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ ప్రజెంట్ చేస్తే తీసుకోమని సూర్య కుమార్ యాదవ్ డైరెక్ట్ గా చెప్పడం నిర్వాహకులకు మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పాడు సూర్య. దీంతో ట్రోఫీ ప్రజెంటేషన్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోనని మల్లగుల్లాలు పడుతోంది ACC.
షేక్ హ్యాండ్ వివాదం:
ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లో పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైమ్‌లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
విన్నింగ్ సిక్స్ కొట్టిన వెంటనే సూర్య నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్‌లోనే వేచి చూసి వెళ్లిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది.
పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని ఇండియా ఇండియా ప్లేయర్లు తీసుకున్న నిర్ణయం గురించి రెఫరీ పైక్రాఫ్ట్ .. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు చెప్పి ఐసీసీ ప్రవర్తనా నియమావళిని, క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అతడిని తక్షణమే టోర్నమెంట్ నుంచి తొలగించాలని పాక్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం యూఏఈతో జరగబోయే పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఉండటంతో పీసీబీ గుర్రుగా ఉంది. తమ డిమాండ్‌ను అంగీకరించని పక్షంలో యూఏఈతో మ్యాచ్ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకోవడమే తమ ముందున్న మార్గమని పీసీబీ హెచ్చరించింది.