మంత్రి క్యాంపు ఆఫీస్ ముట్టడి

మంత్రి క్యాంపు ఆఫీస్ ముట్టడి

సూర్యాపేట టౌన్, వెలుగు:

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన విద్యుత్‌‌ మంత్రి జగదీశ్‌‌రెడ్డి క్యాంపు ఆఫీస్‌‌ ముట్టడి ఉద్రిక్తమైంది. స్థానిక ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా ఆఫీస్‌‌కు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కండక్టర్‌‌ సొమ్మసిల్లి పడిపోగా, మరో మహిళా కండక్టర్‌‌ కాలికి గాయమైంది. పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్‌‌కు తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నా చర్చలు జరపకుండా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వినతిపత్రం ఇవ్వడానికి మంత్రి క్యాంపు ఆఫీస్‌‌కు శాంతియుతంగా వెళ్లినా పోలీసులు అడ్డుకొని దాడి చేయడం ఎంతవరకు కరెక్టని నిలదీశారు. మహిళా కండక్టర్లపై మగ పోలీసులతో దాడి చేయించడం వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరారన్నారు. దాడి చేసిన పోలీసులపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కండక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు.

గుత్తా కాన్వాయ్‌‌ను అడ్డుకున్న కార్మికులు

కోదాడ, వెలుగు: ఆర్టీసీ కార్మికులు  గురువారం కోదాడ పర్యటనకు వచ్చిన శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కాన్వాయ్‌‌ను అడ్డుకున్నారు. కాన్వాయ్‌‌ ఆగడంతో ఆయన వెహికల్‌‌ దిగి వాళ్లతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు వినతిపత్రం అందించారు. తర్వాత బస్టాండ్‌‌ దగ్గర జరిగిన ధర్నాలో కార్మికులు మాట్లాడారు. సమ్మె విషయంలో రాజీ పడబోమన్నారు. డిమాండ్లను సర్కారు ఆమోదిస్తేనే విరమిస్తామని చెప్పారు.