- విడతల వారీగా 1500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
- సూర్యాపేట జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు
సూర్యాపేట, వెలుగు: పల్లె పోరుకు పోలీసులు ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా మొదటి విడత నామినేషన్‌పూర్తి కాగా రెండవ విడత నామినేషన్‌ల ప్రక్రియ కొనసాతుండటంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలు, గొడవలు సృష్టించే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. దీనిలో భాగంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ బహుమతులు, మద్యం, డబ్బులు, వస్తువులు పంచకుండా నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు
సూర్యాపేట జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలు, 4388 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఇందులో మొదటి విడత 159 గ్రామాల్లో ఎన్నికల జరగనుండగా 47 సమస్యాత్మక గ్రామాలు, రెండో విడతలో 181 గ్రామాలకు 65 సమస్యాత్మక గ్రామాలు, మూడో విడతలో 146 గ్రామాలకు ఎన్నికలు ఉండగా 58 సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన గ్రామాల్లో పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు గతంలో నేరాలకు పాల్పడ్డ వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడమని సమస్యలు, సృష్టించమని ముందస్తుగా పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
జిల్లాలో ఏడు చెక్‌పోస్టుల ఏర్పాటు
జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా, ప్రజలను ప్రలోభాలకు గురు చేయకుండా జిల్లాతో సరిహద్దుల వెంట ఏడు చెక్‌పోస్టులని ఏర్పాటు చేశారు. కోదాడ రూరల్ పరిధిలోని జాతీయ రహదారి 65 రామపురం వద్ద ఒక చెక్‌పోస్టు, చింతలపాలెం పరిదిలోని దొండపాడు, మఠంపల్లి పరిధి మట్టపల్లి బ్రిడ్జి, తిరుమలగిరి పరిది పాత తిరుమలగిరి, మద్దిరాల పరిధి కుంటపల్లి, మోతే పరిధి మామిల్లగూడెం వద్ద, సూర్యాపేట రూరల్‌పరిది టేకుమట్ల వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు చేయనున్నారు.
1500 మందితో బందోబస్తు
జిల్లాలో 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరిలో రూట్‌మొబైల్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ కోర్స్ విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్ బూత్‌ల వద్ద, ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద సజావుగా ఎన్నికలు జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
పల్లె పోరుపై నిఘా..
పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం, ఇతర వస్తువులు అక్రమంగా పంపిణీ చేయకుండా జిల్లా పోలీస్‌పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్లు అక్రమ మద్యం సీజ్‌చేశారు. అలాగే 50 లీటర్లు బెల్లం పానకం నిర్వీర్యం చేశారు. లైసెన్స్ డ్ ఆయుధాలు 31 తాత్కాలిక స్వాధీనం, 122 కేసుల్లో 291 మంది బైండోవర్‌చేశారు. జిల్లాలో పటిష్ట నిఘాకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్‌ఎస్‌టీ టీంలు నాలుగు, ఎంసీసీ టీంలు మండలానికి ఒకటి చొప్పున 23, ఎఫ్‌ఎస్‌టీలు 23, పోలీస్‌స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్18 బృందాలను ఏర్పాటు చేశారు.
మోడల్‌కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తాం
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు పోలీసు శాఖ ప్రణాళికతో పని చేస్తుంది. ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.- ఎస్పీ నరసింహ, సూర్యాపేట
