సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం జరగ్గా.. నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద విషయాన్ని బయటకు రాకుండా కంపెనీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ కంపెనీ ఎదుట సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ యాజమాన్యం స్పందించలేదన్నారు. కంపెనీ నుంచి వస్తున్న పొల్యూషన్తో అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు. భద్రతా చర్యలు తీసుకోకుండా కార్మికులతో పని చేయిస్తున్నారని ఆరోపించారు.
