
- ఓ వ్యక్తి హత్యకు సంబంధించి సుపారీ పంపకాల్లో తేడా వల్లే ఘాతుకం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 రోజుల కింద జరిగిన సారగండ్ల శివ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. పాత కక్షల నేపథ్యంలో మాతంగి మధు, అతని అనుచరులు శివను కుసుమవారి గూడెం వద్ద ఓ బెల్ట్ షాప్ లో దారుణంగా హతమార్చారు. ఈ కేసులో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఊహించని విషయాలు తెలిశాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. శివ, మధు గతంలో గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఏడాది కింద కోదాడకు చెందిన ఓ వ్యక్తిని చంపేందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి వద్ద సుపారీ తీసుకున్నారు. వాటాల పంపకంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శివ అప్రూవర్‌గా మారి సుపారీ హత్య విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు మధును అదుపులోకి తీసుకొని విచారించగా సుపారీ గుట్టు బయటపడింది.
అయి తే జిల్లాలో పని చేసిన ఓ సీఐ దీన్ని అనుకూలంగా మార్చుకొని, సదరు ప్రభుత్వ ఉద్యోగిని కేసు నుంచి తప్పించేందుకు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. నిందితులపై కేసు నమోదు చేయకుండా కేవలం బైండోవర్ చేసి వదిలేశారు. తర్వాత మధు, అతని అనుచరులు శివని ఎలాగైనా అంతమొందించాలని రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండు నెలల కింద మధు వద్ద కత్తులు దొరికినా అతనిపై చర్యలు తీసుకోలేదని, తీసుకుంటే ఇప్పుడు శివ హత్యకు గురయ్యేవాడు కాదని అతని కుటుంబసభ్యులు అంటున్నారు.