మా సస్పెన్షన్ అన్యాయం..పార్టీ ఎంపీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకే చర్యలా? : కొయ్యూరు కాంగ్రెస్ నేతలు

మా సస్పెన్షన్ అన్యాయం..పార్టీ ఎంపీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకే చర్యలా? : కొయ్యూరు కాంగ్రెస్ నేతలు
  •     కొయ్యూరు కాంగ్రెస్ నేతల ఆవేదన
  •     గాంధీ భవన్‌‌‌‌లో పీసీసీ నేతలకు ఫిర్యాదు
  •     సస్పెన్షన్ ఎత్తివేయాలని వినతి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పేద పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే సస్పెండ్ చేస్తారా? అంటూ మంథని నియోజకవర్గం మల్హర్ మండలం కొయ్యూరు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై విధించిన సస్పెన్షన్ అన్యాయమని, పునరాలోచించి ఎత్తివేయాలని పీసీసీ నాయకత్వాన్ని కోరారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో గాంధీ భవన్‌‌‌‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సభ్యులు అందుబాటులో లేకపోవడంతో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు వినతిపత్రం అందజేశారు. కొయ్యూరు ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు మెంబర్ లకావత్ లక్ష్మీ, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ ఖలీమొద్దీన్ మాట్లాడుతూ.. తాము దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్తలమని, పార్టీ ప్రజాప్రతినిధులుగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు. 

తాము గిరిజన, మైనార్టీ వర్గాలకు చెందిన వారమని, బలహీన వర్గాలపై చర్యలు తీసుకోవడం పార్టీకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతోనే సస్పెండ్ చేసినట్లు మల్హర్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రకటించారని పీసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక రాజకీయాలు, అంతర్గత విభేదాలు, తప్పుడు సమాచారంతో తమపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. తాము పార్టీ క్రమశిక్షణను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, పార్టీ కోసం నిరంతరం పనిచేశామని పేర్కొన్నారు. సస్పెన్షన్‌‌‌‌తో సీనియర్ కార్యకర్తలు, సాధారణ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని తెలిపారు. పీసీసీ నాయకత్వం పునరాలోచించి సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.