ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కుమార్ పై సస్పెన్షన్ వేటు

ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కుమార్ పై సస్పెన్షన్ వేటు

పరారీలో ఉన్న మనోజ్ కోసం పోలీసుల వేట

ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా తరలించిన మనోజ్

త్వరలో పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్న ఏసీబీ

అనంతపురం: కోట్ల రూపాయల విలువైన అవినీతి సొమ్మును  దాచిపెట్టినట్లు మనోజ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. పరారీలో ఉన్న మనోజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో మనోజ్ కుమార్ 8 ట్రంకు పెట్టెల్లో దాచిన 2.42 కిలోల బంగారు, 84కిలోల వెండి ఆభరణాలతోపాటు.. మూడు కార్లు, ఏడు బైకులు, నాలుగు ట్రాక్టర్లు.. 3 9ఎంఎం నకిలీ పిస్టళ్లు.. ఒక ఎయిర్ గన్.. విలువైన ఆస్తుల డాక్యూమెంట్లు పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. తన అవినీతి సొత్తును తన వద్ద పనిచేసే  డ్రైవర్ మామ ఇంట్లో దాచిన మనోజ్ కుమార్ పోలీసుల సోదాల గురించి తెలిసిన వెంటనే పరారయ్యాడు.

మనోజ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు ఉద్యోగ వర్గాల ద్వారా గాలిస్తున్నారు. అక్రమాల వ్యవహారం గురించి అధికారికంగా సమాచారం అందుకున్న ఖజానా శాఖ మనోజ్‌ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనోజ్ కుమార్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. కట్టుదిట్టమైన భద్రత.. విలువైన రికార్డులు ఉండే ఖజానాల నుండి దొంగలించాడా.. ? అన్నది తెలుసుకునేందుకు శాఖాపరమైన విచారణ జరుగుతోంది. మరో వైపు ఏసీబీ కూడా సమాంతరంగా పూర్తి స్థాయి విచారణ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.