నర్సాపూర్ పై వీడని సస్పెన్స్

నర్సాపూర్ పై వీడని సస్పెన్స్
  • అభ్యర్థులను ప్రకటించని ప్రధాన రాజకీయ పార్టీలు       
  • అయోమయానికి గురవుతున్న ఆయా పార్టీల క్యాడర్

మెదక్, నర్సాపూర్, వెలుగు : ఎన్నికల షెడ్యూల్​ వెలువడి వారం రోజులు గడుస్తున్నా నర్సాపూర్​అసెంబ్లీ టికెట్లపై సస్పెన్స్​ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్​తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలేవి అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో నిలుస్తారనే దానిపై అయోమయం నెలకొంది. ఎవరికి టికెట్​వస్తుందో తెలియక ఆయా పార్టీల క్యాడర్​ గందరగోళంలో ఉంది. బీఆర్‌‌ఎస్​ఆగస్టు 21న రాష్ట్రంలోని 115 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. మెజారిటీ చోట్ల సిట్టింగ్​ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చినప్పటికీ నర్సాపూర్​ సిట్టింగ్​ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి మాత్రం టికెట్​ఇవ్వకుండా పెండింగ్​పెట్టింది. నాలుగు రోజుల్లో ఇక్కడ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ప్రకటించలేదు.

రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్​ టికెట్​ ఇచ్చేందుకే హైకమాండ్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి టికెట్​వదిలే ప్రసక్తే లేదని పలుమార్లు ప్రకటించారు. ఆయన మద్దతుదారులు హైదరాబాద్​ వెళ్లి మంత్రి హరీశ్​రావు ఇంటి వద్ద, ఆ తర్వాత నర్సాపూర్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా చాలా రోజుల వరకు హైకమాండ్​ నుంచి ఎలాంటి రెస్పాన్స్​ రాలేదు. ఇటీవల బీఆర్‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు మదన్ రెడ్డితో చర్చలు జరపగా తనకు టికెట్​ ఇవ్వక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ఆ తర్వాత స్వయంగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మదన్ రెడ్డిని ప్రగతి భవన్​కు పిలిపించుకుని మాట్లాడి నచ్చజెప్పినట్టు సమాచారం.

దీంతో సునీతారెడ్డికి లైన్​ క్లియర్​ అయిందని అందరూ భావించారు. అయితే ఈ నెల 15న 69  మందికి, 16న 29 మందికి పార్టీ బీఫామ్​లు అందించింది. ఈ లిస్టులో సునీతారెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. మదన్​ రెడ్డి ఒప్పుకుని నియోజకవర్గంలో పనిచేస్తేనే బీఆర్‌‌ఎస్​ గెలిచే అవకాశం ఉందని, అందువల్ల ఆయనను ఒప్పించిన తరువాతే సునీతారెడ్డికి బీఫామ్​ ఇవ్వనున్నట్టు సమాచారం. 

కాంగ్రెస్​ రేసులో అనిల్​.. ఆవుల

కాంగ్రెస్​టికెట్‌ కోసం నలుగురు నేతలు అప్లై చేసుకున్నప్పటికీ  ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​ కుమార్​, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ ఆవుల  రాజిరెడ్డి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని  పార్టీ హైకమాండ్​ భావిస్తుండటంతో కచ్చితంగా తనకు అవకాశం వస్తుందని అనిల్​ కుమార్​ నమ్మకంతో ఉన్నారు. అయితే నియోజకవరవర్గంలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసినందున తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని ఆవుల రాజిరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం.  

దీంతో గాలి అనిల్ కుమార్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్​ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్​ 55 మంది పేర్లతో అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ రిలీజ్​ చేయగా అందులో నర్సాపూర్​ లేదు. దీంతో ఇక్కడ కాంగ్రెస్​ టికెట్​అనిల్ కుమార్​కు వస్తుందా.. ఆవుల రాజిరెడ్డికి వస్తుందా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

బీజేపీలో ఛాన్స్​ ఎవరికో..

బీజేపీ టికెట్​ కోసం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మెన్​ ఎర్రగొళ్ల మురళీ యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ వాల్దాస్​ మల్లేశ్​ గౌడ్, రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి అప్లై చేసుకున్నారు. ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ హైకమాండ్​ మాత్రం ఇంకా బీజేపీ అభ్యర్థిత్వాలు ఖరారు చేయకపోవడంతో ఈ నలుగురిలో టికెట్ ఎవరికి లభిస్తుందన్న దానిపై సస్పెన్స్​ వీడటం లేదు.