
మేడ్చల్, వెలుగు: వారి పెండ్లి జరిగి రెండు వసంతాలు కూడా నిండలేదు. చిలకా గోరింకల్లా సాగాల్సిన వారి సంసారాన్ని అనుమానం అనే పెనుభూతం పటాపంచలు చేసింది. పెళ్లయినప్పటి నుంచే భార్యపై అనుమానం పెట్టుకున్న ఓ భర్త ఆమెను చంపేసి పరారయ్యాడు. స్థానికులు, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఉప్పల గ్రామానికి చెందిన రాంబాబు, ప్రశాంతి(22) దంపతులు బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం మేడ్చల్ పట్టణానికి వచ్చారు.
రాంబాబు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర క్రితమే వివాహం జరగ్గా.. మొదట్నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాంబాబు భార్యను అనుమానించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ప్రశాంతి(22) చనిపోయి కనిపించింది. వీరికి ఐదేళ్ల పాప ఉండగా ఆమె ఏడుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా విషయం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె గొంతుపై గాయాలు ఉండడంతో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు భర్త రాంబాబు పరారీలో ఉండడంతో ఆయన కోసం గాలిస్తున్నారు.