
మాదాపూర్, వెలుగు: హోటల్ రూమ్‌లో హెటిరో ఫార్మా ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అంబటూర్ ప్రాంతానికి చెందిన శ్రీహరి (25) తన తండ్రి రమేశ్‌కు చెందిన రాఘవ ఎంటర్ప్రైజెస్బిజినెస్ పనులను చూసుకుంటున్నాడు. పాండిచ్చేరిలోని తట్టంవాడి కామరాజ్ నగర్ ప్రాంతానికి చెందిన ఎస్. శ్రావణ ప్రియ(25) జడ్చర్లలోని హెటిరో కంపెనీలో జాబ్ చేస్తోంది.
శ్రీహరి, శ్రావణ ప్రియ ఇద్దరు చెన్నైలో ఇంటర్ చదివే సమయంలో ఫ్రెండ్స్. రెండ్రోజుల కిందట శ్రీహరి ఫ్రెండ్స్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. మంగళవారం ఫ్రెండ్స్‌తో కలిసి గోల్కోండ కోటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇక్కడే ఉంటున్న శ్రావణ ప్రియను కలిసేందుకు ఆమె కాల్ చేశాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ నం.36లోని గోల్డెన్ హైవ్ ఓయో హోటల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు రూమ్ బుక్ చేశాడు.
డ్యూటీ ముగిసిన తర్వాత శ్రావణ ప్రియ జడ్చర్ల నుంచి రాత్రి 9 గంటలకు హోటల్ రూమ్‌కు వచ్చింది. శ్రీహరి, శ్రావణ ప్రియ ఇద్దరూ కలిసి రూమ్‌లో మద్యం తాగారు. అర్ధరాత్రి శ్రీహరికి వాంతులు కావడంతో దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. బుధవారం ఉదయం శ్రావణ ప్రియ హోటల్ రూమ్ నుంచే జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. 10 గంటలకు ఫుడ్ ఇచ్చేందుకు డెలివరీ బాయ్ హోటల్ రూమ్ దగ్గరకు వెళ్లగా శ్రావణ ప్రియ స్పందించలేదు. దీంతో డెలివరీ బాయ్ ఫుడ్‌ను హోటల్ రిసెప్షన్లో ఇచ్చేసి వెళ్లాడు. ముందురోజు అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లిన శ్రీహరి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హోటల్‌కు చేరుకున్నాడు.
మూడో ఫ్లోర్‌లోని రూమ్‌కు వెళ్లి చూడగా.. శ్రావణ ప్రియ ఎలాంటి కదలిక లేకుండా నేలపై పడి ఉంది. హోటల్ సిబ్బందితో కలిసి శ్రీహరి ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకువచ్చారు. అంబులెన్స్ సిబ్బంది శ్రావణ ప్రియను పరిశీలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. హోటల్ సిబ్బంది మాదాపూర్పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలను సేకరించారు. రూమ్ లో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని అదుపులోకి తీసుకొన్నారు. డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.