నాలుగోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌‌

నాలుగోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలిచిన ఇండోర్‌‌

ఇండోర్: మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఇండోర్ వరుసగా నాలుగోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలిచింది. జాతీయ వ్యాప్తంగా శుభ్రత విషయంలో నిర్వహించిన సర్వేలో క్లీనెస్ట్‌ సిటీగా నిలిచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020ని ఇండోర్‌‌ నెగ్గింది. మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌ (ఎంవోయూహెచ్‌ఏ) స్వచ్ఛతా సిటీ సర్వే రిపోర్టులో సూరత్‌ దేశంలో రెండో క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. నవీ ముంబై మూడో పొజిషన్‌ను కైవసం చేసుకుంది. ఎంవోయూహెచ్‌ఏ గురువారం నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ప్రకటన చేశారు.

‘హృదయపూర్వక అభినందనలు! ఇండియాలో ఇండోర్ వరుసగా నాలుగోమారు క్లీనెస్ట్‌ సిటీగా నిలిచింది. ఆ సిటీతోపాటు అక్కడి ప్రజలు శుభ్రత దిశగా తమ అంకితభావాన్ని చూపారు. అతిశయోక్తి కలిగించే ఈ ప్రదర్శనకు గాను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ చౌహాన్‌, రాష్ట్ర ప్రజలు, రాజకీయ నేతలు, మున్సిపల్ కార్పొరేషన్ శుభాభినందనలు’ అని హర్దీప్ పురి ట్వీట్ చేశారు. గంగా నది ఒడ్డులో స్వచ్ఛ పట్టణంగా వారణాసి ఎంపికైంది. అలాగే జలంధర్ కంట్ క్లీనెస్ట్‌ కంటోన్మెంట్‌గా నిలిచింది. ఈ సర్వేలో 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, గంగా నదీ పరివాహక టౌన్లతో కలిపి 92 పట్టణాలకు చెందిన 1.87 కోట్ల మంది పౌరులు పాల్గొన్నారని ఎంవోయూహెచ్‌ఏ ప్రతినిధి రాజీవ్ జైన్ తెలిపారు.