స్వచ్ఛ సర్వేలో జనం ఓట్లను మున్సిపల్ సిబ్బందితో వేయిస్తున్నరు

స్వచ్ఛ సర్వేలో జనం ఓట్లను  మున్సిపల్ సిబ్బందితో వేయిస్తున్నరు
  • స్వచ్ఛ సర్వేక్షణ్​లో స్థానం కోసం శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీ అధికారుల నిర్వాకం
  •  మున్సిపల్ ఆఫీసు నుంచి వచ్చినమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి జనాల ఫోన్లతో ఓటింగ్
  •  ఒక్కో సిబ్బంది 200 మందితో ఓటింగ్ చేయించాలని అధికారుల ఆదేశం   
  •  స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కొనసాగుతున్న సర్వే

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్ పై  జనానికి అవేర్‌‌‌‌నెస్‌‌ కల్పించి సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన అధికారులు.. అడ్డదారిలో అవార్డులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  సర్వే అంతా ఆన్ లైన్‌‌లో ఉండటంతో ఎలాగైనా అవార్డులకు ఎంపిక కావాలని గ్రేటర్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి.  అయితే, జనం సర్వేలో పాల్గొనకుండానే పాల్గొన్నట్లు చూపించి అవార్డులను సొంతం చేసుకుకోవాలని  పాలకులు, అధికారులు ప్లాన్ చేశారు. ఇందుకోసం మున్సిపాలిటీ సిబ్బందిని ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. తాము మున్సిపాలిటీ ఆఫీసు నుంచి వచ్చామని,  మీ ఫోన్ నెంబర్ చెప్పండంటూ సిబ్బంది జనాలను అడుగుతున్నారు. ఆ తర్వాత ఓటీపీని తీసుకుంటున్నారు. వారి మొబైల్ నంబర్ తోనే వెబ్ సైట్​లో లాగిన్ అయ్యి.. సర్వేలో పార్టిసిపేట్ చేసి ఆయా మున్సిపాలిటీలకు అనుకూలంగా ఓటింగ్ చేస్తున్నారు.  ఇలా మున్సిపల్ సిబ్బంది ఒక్కొక్కకరు.. 200 మంది నుంచి ఫోన్ నంబర్లు, ఓటీపీలు తీసుకురావాలని కొన్నిచోట్ల అధికారులు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.  

మంత్రి ఆదేశంతో ఉరుకులు.. పరుగులు 

జాతీయ స్థాయిలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పనితీరును చూసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.  స్వచ్ఛ సర్వేక్షణ్​లో  దేశంలో ఉన్న కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు తమ స్థానిక సంస్థల అభివృద్ధిని, స్వచ్ఛతను నిరూపించుకుని  మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నాయి.  స్వచ్ఛ సర్వేక్షణ్–-2023 సర్వేలకు ఈసారి అన్ని అవార్డులు మనకే వచ్చేలా  చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  దీంతో మొన్నటి వరకు గ్రేటర్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పట్టించుకోని అధికారులు, పాలకులు ఇప్పుడు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. 

అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటూ..

గ్రేటర్ శివార్లలో మొత్తం 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో పాల్గొనేందుకు ముందుగా ఆయా కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీని నామినేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.  కాలనీల్లో 500 మీటర్లకు ఒక టాయిలెట్, ఆయా కాలనీలకు నీటి సదుపాయంతో కూడిన ఫంక్షన్ హాల్, చెత్త నిర్వహణ, చెట్లు తదితర అన్ని సరిగా ఉన్నాయా లేదా అనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో అన్ని బాగున్నాయని సమాధానం ఇచ్చేస్తున్నారు. మరికొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఏమీ లేదంటూ అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లే మండిపడుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్​కు నామినేట్ చేసే ముందు కాలనీలన్నీ తిరిగి చూడాలని కోరుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా అన్నీ ఉన్నట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా గ్రీనరీ అవార్డులను కొట్టేందుకు అధికారులు, పాలకులు ఇప్పుడు మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

9  అంశాలపై సర్వే ..

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0  కింద  అవార్డులను అందజేసేందుకు కేంద్రం గత నెల 7 నుంచి ఈ నెల 16 వరకు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా సర్వేలో పాల్గొనాల్సి ఉంది. మొబైల్ నంబర్​తో లాగిన్ అయ్యాక 9 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.  ‘ మీ ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరిస్తున్నారా?,  ‘ మీ ఇంట్లో తడి, పొడి చెత్తను  వేరు చేస్తున్నారా?’, ‘ మీ పరిసరాల్లోని కాల్వలు లేదా నాలాలు క్లీన్ గా  ఉన్నాయా’?, ‘ మీ నగరంలో రీసైక్లింగ్ కేంద్రం గురించి మీకు తెలుసా?,  మీరు ఇటీవల పబ్లిక్ టాయిలెట్ ను ఉపయోగించారా? అవి క్లీన్ గా నిర్వహించబడుతున్నాయా? లాంటి వాటితో మొత్తం 9 ప్రశ్నలను సర్వేలో అడుగుతారు. చివరగా కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి ఇచ్చే రేటింగ్ గురించి అడుగుతారు.