స్వగృహ ఫ్లాట్లకు ఫుల్​ డిమాండ్

స్వగృహ ఫ్లాట్లకు ఫుల్​ డిమాండ్
  • ఫ్లాట్లు ఇప్పించాలంటూ ప్రగతి భవన్​, సీఎంవో, మంత్రుల సిబ్బంది విజ్ఞప్తులు
  • హౌసింగ్​ అధికారులకు మొర పెట్టుకుంటున్న బంధువులు, ఫ్రెండ్స్​
  • ఇప్పటిదాకా 20 వేలకుపైగా దరఖాస్తులు.. బండ్లగూడకే ఎక్కువ మొగ్గు

హైదరాబాద్​, వెలుగు:  బండ్లగూడ, పోచారంలో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన రాజీవ్​ స్వగృహ ఫ్లాట్లకు డిమాండ్​ ఎక్కువవుతోంది. ప్రగతిభవన్​, సీఎంవో, మంత్రుల దగ్గర పనిచేస్తున్న సిబ్బంది.. తమకు ఫ్లాట్లు ఇప్పించాలంటూ హౌసింగ్​ అధికారులను కోరుతున్నారు. కొందరు అధికారుల బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్​ కూడా ఫ్లాట్​ ఇప్పించాలని కోరుతున్నారు. కంప్యూటర్​ లాటరీ ద్వారా మాత్రమే ఫ్లాట్లను కేటాయిస్తారంటూ వాళ్లకు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ ఇండ్ల కోసం వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 12న మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ.. వచ్చే నెల 14 వరకు కొనసాగనుంది. అన్ని రకాల ఫ్లాట్లకు కలిపి 20 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. గడువు ముగిసే నాటికి 35 వేల దాకా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఘట్​కేసర్​, పోచారంలోని ఫ్లాట్లతో పోలిస్తే ఎక్కువ మంది బండ్లగూడ రాజీవ్​ స్వగృహ ఫ్లాట్లవైపే మొగ్గు చూపుతున్నారు. బహిరంగ మార్కెట్​తో పోలిస్తే స్వగృహ అపార్ట్​మెంట్ల ఫ్లాట్ల ధరలు తక్కువున్నాయి. మామూలుగా బండ్లగూడలో 1,200 చదరపుటడుగుల ట్రిపుల్​ బెడ్రూం ఫ్లాట్​ ఖరీదు రూ.90 లక్షలకుపైనే ఉండగా.. రాజీవ్​ స్వగృహలో రూ.50 లక్షలకే వస్తోంది. డబుల్  బెడ్రూం ఫ్లాట్​ రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలకు లభిస్తోంది. సింగిల్​ బెడ్రూం ఫ్లాట్​ ధర రూ.20 లక్షల లోపే ఉంది.  

కమ్యూనికేషన్​ గ్యాప్

బండ్లగూడ, పోచారంలోని సెమీ ఫర్నిష్డ్​ 1,187 సింగిల్​ బెడ్రూం ఫ్లాట్ల కోసం గత మంగళవారం హెచ్​ఎండీఏ తాజా నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బండ్లగూడలో 645 ఫ్లాట్లను రెగ్యులర్​ కేటగిరీ కింద కేటాయించనుండగా.. మరో 100 ఫ్లాట్లను వృద్ధులకు కేటాయించనున్నారు. పోచారంలో 442 ఫ్లాట్లకు రెగ్యులర్​ కేటగిరీలో హెచ్​ఎండీఏ లాటరీ నిర్వహించనుంది.  514, 524, 545, 627, 653 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్లు రూ.18 లక్షలకే లభిస్తున్నాయి. రాజీవ్​ స్వగృహ ఫ్లాట్లు, ప్లాట్ల అమ్మకానికి సంబంధించి హెచ్​ఎండీఏ, హౌసింగ్​ డిపార్ట్​మెంట్ల మధ్య కమ్యూనికేషన్​ గ్యాప్​ ఉన్నట్టు అధికారులు చర్చించుకుంటున్నారు. హౌసింగ్​ అధికారులతో చర్చించకుండానే, ఆన్​లైన్​లో టెక్నికల్​ ఏర్పాట్లు పూర్తి కాకముందే హెచ్​ఎండీఏ నోటిఫికేషన్లు ఇస్తున్నదని అంటున్నారు. దీని వల్ల అప్లికేషన్లు పెట్టుకునే టైంలో సాంకేతిక సమస్యలు వస్తాయని, అన్ని ఏర్పాట్లు చేయకముందే నోటిఫికేషన్​ ఎందుకిస్తున్నారని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.