తాండూరు ఛైర్ పర్సన్ పదవి విషయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో చైర్ పర్సన్ గా స్వప్న రాజీనామ చేయకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. ఛైర్ పర్సన్ సీటు విషయంలో 25వ తేదీన ఆయనకు ఫోన్ చేయడం జరిగిందని.. తప్పకుండా కూర్చొని మాట్లాడుకుందామని చెప్పడం జరిగిందన్నారు. కానీ..గత రెండు రోజుల నుంచి ఎందుకు అందుబాటులోకి రావడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఛైర్ పర్సన్ సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల పదవీకాలం అయిపోయినా.. స్వప్న రాజీనామా చేయడం లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు. ఆయన v6తో మాట్లాడారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఛైర్ పర్సన్ గా స్వప్న, వైస్ ఛైర్మన్ లుగా దీపలు నియమితులయ్యారని తెలిపారు. ఛైర్ పర్సన్ గా రెండున్నర సంవత్సరాలు ఉండాలని అధిష్టానం, పెద్దలు నిర్ణయించడంతో పాటు లిఖిత పూర్వకంగా రాసుకున్నారని వెల్లడించారు.
26వ తేదీన రెండున్నర సంవత్సరాలు పూర్తయిందని.. రిజైన్ చేయకుండా స్వప్న తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముందుకు తీసుకొచ్చారని, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఛైర్ పర్సన్ గా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన స్వప్న రెండున్నరేళ్లు.. తర్వాత ఎమ్మెల్యే రోహిత్ వర్గానికి చెందిన దీప మరో రెండున్నరేళ్లు కొనసాగాలని గతంలో ఒప్పందం కుదిరింది. స్వప్న పదవీకాలం ముగిసింది. కానీ.. స్వప్న కుర్చీ దిగడానికి ససేమిరా అంటున్నారు. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని దీప ప్రయత్నాలు చేస్తున్నారు. స్వప్న, దీపలు కాకుండా మూడో వ్యక్తికి సీటు దక్కే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
