సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సదస్సు రద్దు

సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సదస్సు రద్దు
  • జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన వాయిదాతో నిర్ణయం  
  • జీ7 సమిట్ లోనే క్వాడ్ దేశాధినేతల మీటింగ్

మెల్ బోర్న్: ఈ నెల 24న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సదస్సు రద్దయింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకోవడంతో సమిట్ క్యాన్సిల్ అయింది. ఈ మేరకు  సమిట్​ రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం ప్రకటించారు. జపాన్​లోని హిరోషిమాలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగే జీ7 సమిట్ సందర్భంగా క్వాడ్ దేశాధినేతల మీటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. క్వాడ్​లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ సభ్య దేశాలు. ఈసారి సదస్సును సిడ్నీలో ఈ నెల 24న నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, మన ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా హాజరు కావాల్సి ఉంది. అయితే,  అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్ సడెన్​గా తన పర్యటన వాయిదా వేసుకున్నారు. 

మోడీ టూర్ లో మార్పుల్లేవ్..  

క్వాడ్ సదస్సు రద్దు అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. మోడీ మొదట ఈ నెల 19 నుంచి 21 వరకు జపాన్ లో పర్యటిస్తారు. హిరోషిమా సిటీలో నిర్వహించే జీ7 సమిట్ లో పాల్గొంటారు. 22న పపువా న్యూ గినియాకు వెళ్లి ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమిట్ కు హాజరవుతారు. అదే రోజు ఆస్ట్రేలియాకు వెళ్లి 24 వరకు అక్కడే ఉంటారు. మోడీతో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ఆయన బిజినెస్ మీటింగుల్లోనూ పాల్గొంటారని, సిడ్నీలో నిర్వహించే పబ్లిక్ ఈవెంట్ కు హాజరవుతారని పేర్కొన్నారు.