గాయత్రి జోడీకి టైటిల్.. ఫైనల్లో పోరాడి ఓడిన శ్రీకాంత్‌

గాయత్రి జోడీకి టైటిల్.. ఫైనల్లో పోరాడి ఓడిన శ్రీకాంత్‌

లక్నో: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్, హైదరాబాదీ పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విమెన్స్ డబుల్స్ టైటిల్‌‌ను నిలబెట్టుకున్నారు. కానీ, టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చివరి మెట్టుపై బోల్తా కొట్టాడు. ఆదివారం జరిగిన విమెన్స్ డబుల్స్ ఫైనల్లో  గాయత్రి–ట్రీసా 17-21, 21-13, 21-15తో జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కాహో ఒసావా– మై తానాబెపై ఉత్కంఠ విజయం సాధించారు. 

మూడు గేమ్స్ పాటు  సాగిన ఫైనల్లో  ఆరంభంలో ఇండియా షట్లర్లు తడబడ్డారు. 49 షాట్ల ఉత్కంఠభరితమైన ర్యాలీతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ నిలకడగా ఆడుతూ 18–-15 ఆధిక్యం సాధించి, చివరకు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయత్రి–ట్రీసా గొప్పగా పుంజుకున్నారు.

బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోర్టు నుంచి ట్రీసా పవర్ హిట్టింగ్ చేయగా.. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద గాయత్రి చురుగ్గా ఆడింది. దాంతో 11–5తో బ్రేక్‌కు వెళ్లిన ఇండియా షట్లర్లు అదే జోరును కొనసాగిస్తూ ఈజీగా గేమ్ నెగ్గారు. నిర్ణయాత్మక గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య జోడీ పూర్తి ఆత్మవిశ్వాసం చూపెట్టింది. ట్రీసా తెలివైన డ్రాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకోగా.. గాయత్రి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొట్టడంతో  11-–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ జోడీ 13–15తో పుంజుకునే ప్రయత్నం చేసినా చివర్లో మరింత మెరుగ్గా ఆడిన గాయత్రి–ట్రీసా టైటిల్ సొంతం చేసుకుంది. 

శ్రీకాంత్‌కు నిరాశ
2017లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత శ్రీకాంత్ టైటిల్ గెలవాలనే ప్రయత్నం మరోసారి ఫెయిలైంది.  మెన్స్ సింగిల్స్  ఫైనల్లో అతను 16-–21, 21–-8, 20–-22తో 59 వ ర్యాంకర్ జాసన్ గుణవన్ (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌‌తో సరిపెట్టాడు.