ఉప్పల్, వెలుగు: జాతీయ, ప్రాంతీయ ఉద్యమాలు ఏవైనా కీలక పాత్రంతా న్యాయవాదులదేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓయూ లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డుసిమస్ వి లీడ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ సామాజిక ఉద్యమమైనా, ఎక్కడ పోరాటాలు జరిగినా అందులో ధర్మం, న్యాయం ఉంటే దాని వెనక న్యాయవాదులుంటారని చెప్పారు. న్యాయవాదులు ఉన్న చోటే విజయం సాధించి ఆ పోరాటం గమ్యాన్ని చేరుకుంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడ్డది కూడా న్యాయవాదులేనని కితాబునిచ్చారు. ఓయూకు వచ్చినప్పుడల్లా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన విద్యార్థులు గుర్తుకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి విభాగం నాయకులు, లా స్టూడెంట్స్ పాల్గొన్నారు.
