
- శాంతిభద్రతలు గాడి తప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్
- పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యథేచ్ఛగా హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం, పోలీసులు విఫలయ్యారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని శనివారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఆ మర్నాడే హైదరాబాద్ లో మరో రెండు హత్యలు జరిగాయి. హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరం.
శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనేందుకు రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలే నిదర్శం. ప్రభుత్వం ఇప్పటికైనా శాంతిభద్రతలు పునరుద్ధరించాలి. గత పదేండ్లలో తెలంగాణలో నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా రూ.వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు పెట్టుబడులపై కూడా ప్రభావం పడుతుంది. సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదు. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలి”అని హరీశ్ పేర్కొన్నారు.
హామీలపై మాట మార్చారు..
హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని హరీశ్ రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ ఆర్‌ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ‘నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్’అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజుల్లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.