లంక చేతిలో ఇండియా ఓటమి

 లంక చేతిలో ఇండియా ఓటమి
  • రోహిత్, చహల్ శ్రమ వృధా
  • రాణించిన కుశాల్, నిశాంక, దసున్ షనక, మదుషంక

దుబాయ్‌‌: ఆసియా కప్​లో ఏడుసార్లు విజేత టీమిండియాకు  మరో దెబ్బ. ఫైనల్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో ఇండియా నిరాశపర్చింది. కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (41 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72), సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (29 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 1 సిక్స్‌‌తో 34) రాణించినా.. బౌలర్లు మరోసారి చేతులెత్తేశారు. దీంతో మంగళవారం జరిగిన  సూపర్​4 రెండో మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల  తేడాతో లంక చేతిలో ఓడింది.

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రోహిత్​సేన 20 ఓవర్లలో 173/8 స్కోరు చేసింది. లంక బౌలర్లలో మదుషంక (3/24) సత్తా చాటాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 174/4  స్కోరు చేసి గెలిచింది.  కుశాల్‌‌ మెండిస్‌‌ (37 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57),  పాథుమ్‌‌ నిశాంక (37 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) రాణించారు. చివర్లో రాజపక్స (17 బాల్స్‌‌లో 2 సిక్సర్లతో 25 నాటౌట్‌‌) , కెప్టెన్​ దసున్‌‌ షనక (18 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33 నాటౌట్‌‌) మెప్పించారు. రెండు వికెట్లు కూడా తీసిన షనకకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఓడిన ఇండియా ఫైనల్​ రేసు నుంచి దాదాపు నిష్ర్కమించింది. పాకిస్తాన్​ తర్వాతి రెండు మ్యాచ్​ల్లో ఓడి.. అఫ్గానిస్తాన్​పై భారీ విజయం సాధిస్తేనే ఇండియా ముందంజ వేయగలదు.  
రోహిత్‌‌, సూర్య మినహా..

స్టార్టింగ్‌‌లో లంక బౌలర్లు లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌కు కట్టుబడటంతో.. మూడో ఓవర్‌‌ ముగియకముందే ఓపెనర్‌‌ రాహుల్‌‌ (6), విరాట్‌‌ కోహ్లీ (0) పెవిలియన్‌‌ చేరారు. దీంతో13/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను రోహిత్‌‌, సూర్య ఆదుకున్నారు. చమిక  కరుణరత్నె (2/27) బాల్‌‌ను మిడాన్‌‌లో బౌండ్రీకి తరలించి రోహిత్‌‌ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఐదో ఓవర్‌‌లో వచ్చిన పేసర్‌‌ అసితా ఫెర్నాండో  బౌలింగ్‌‌లో 6, 4తో 14 రన్స్‌‌ రాబట్టాడు. పవర్‌‌ప్లేలో ఇండియా 44/2కు చేరింది. మధ్యలో లెగ్‌‌ స్పిన్నర్‌‌ హసరంగ, చమిక రెండు ఓవర్లు కట్టుదిట్టంగా వేసి రన్స్‌‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినా రోహిత్‌‌ సిక్స్‌‌, ఫోర్‌‌తో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో తొలి పది ఓవర్లలో ఇండియా 79/2 స్కోరు చేసింది.

11వ ఓవర్‌‌లో మదుషంక బౌలింగ్‌‌లో సూర్య సిక్సర్‌‌తో జోష్‌‌ పెంచాడు. 12వ ఓవర్‌‌లో రోహిత్‌‌ 6, 4, 6తో 18 రన్స్‌‌ పిండుకున్నాడు. కానీ 13వ ఓవర్‌‌లో భారీ షాట్‌‌కు ప్రయత్నించి లాంగాన్‌‌లో నిశాంక చేతికి చిక్కాడు. ఫలితంగా మూడో వికెట్‌‌కు 97 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 15వ ఓవర్‌‌లో సూర్య కూడా వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌‌ తడబడింది. ఈ దశలో రిషబ్‌‌ పంత్‌‌ (17) మూడు ఫోర్లతో  కాసేపు దూకుడు చూపెట్టినా, హార్దిక్‌‌ పాండ్యా (17) ఓ సిక్స్‌‌ కొట్టి 18వ ఓవర్‌‌లో ఔటయ్యాడు. ఇక, 19వ ఓవర్‌‌లో  దీపక్‌‌ హుడా (3), పంత్‌‌  ఔట్‌‌కావడంతో స్కోరు తగ్గింది. లాస్ట్‌‌ ఓవర్లో భువనేశ్వర్‌‌ (0) ఔటైనా, అశ్విన్‌‌ (15 నాటౌట్‌‌) సిక్సర్‌‌తో ఊరటనిచ్చాడు. 

కుశాల్‌‌, నిశాంక హాఫ్‌‌ సెంచరీలు..

టార్గెట్‌‌ ఛేజింగ్​ లంక ఓపెనర్లు నిశాంక, కుశాల్‌‌ నిలకడగా ఆడారు. రెండో ఓవర్‌‌లో ఫస్ట్‌‌ ఫోర్‌‌ కొట్టిన నిశాంక.. థర్డ్‌‌ ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్‌‌లో ఇద్దరు కలిసి 4, 4, 6తో 18 రన్స్‌‌ రాబట్టారు. చహల్‌‌ (3/34) వేసిన ఆరో ఓవర్‌‌లో 4, 6 బాదడంతో లంక 57/0 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించింది. హార్దిక్‌‌ కట్టడి చేసినా.. అశ్విన్‌‌ (1/32) సిక్సర్‌‌ సమర్పించుకున్నాడు. చహల్‌‌ ఓవర్‌‌లో రెండో సిక్సర్‌‌ బాదిన నిశాంక.. పది ఓవర్లకు లంకను 89/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిపాడు.

ఈ దశలో 12వ ఓవర్‌‌లో చహల్‌‌ నాలుగు బాల్స్‌‌ వ్యవధిలో నిశాంక, అసలంక (0)ను ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. ఇక, 13వ ఓవర్‌‌లో ఫోర్‌‌తో కుశాల్‌‌ ఫిఫ్టీ పూర్తి చేసినా, 14వ ఓవర్‌‌లో అశ్విన్‌‌.. గుణతిలక (1)ను పెవిలియన్‌‌కు పంపాడు. ఆ వెంటనే చహల్‌‌.. కుశాల్‌‌ను ఎల్బీ చేయడంతో లంక 110/4తో ఎదురీత మొదలుపెట్టింది. కానీ, ఫామ్​లో ఉన్న రాజపక్స , కెప్టెన్​   షనక  భారీ షాట్లు ఆడటంతో18 ఓవర్లలో లంక 153/4తో నిలిచింది. 12 బాల్స్‌‌లో 21 రన్స్‌‌ కావాల్సిన దశలో భువీ రెండు ఫోర్లు ఇవ్వడంతో మ్యాచ్‌‌  ఇండియా చేజారింది. 7 రన్స్​ అవసరమైన ఆఖరి ఓవర్లో అర్ష్​దీప్​ ఉత్కంఠ రేపినా ఐదో బాల్​కు బైస్​ రూపంలో డబుల్​ తీసిన రాజపక్స, షనక లంకను గెలిపించారు.

సంక్షిప్త స్కోర్లు: 

ఇండియా: 20 ఓవర్లలో 173/8 (రోహిత్ 72, సూర్య 34, మదుషంక 3/24, దుసున్ షనక 2/26. 
శ్రీలంక: 19.5 ఓవర్లలో 174/4 (నిశాంక 52, కుశాల్ 57, షనక 33 నాటౌట్, చహల్ 3/34