
అందరూ అనుకున్నట్లుగానే.. టీ20 వరల్డ్‌కప్ పోస్ట్‌పోన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయా..? ఐసీసీ సంగతి ఎలా ఉన్నా.. నిర్వహణ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం మెగా ఈవెంట్ వాయిదాకే మొగ్గు చూపుతున్నదా..? షెడ్యూల్ ప్రకారం టోర్నీని నిర్వహించి ఆస్ట్రేలియాను హై రిస్క్‌లో పడేయలేమని బోర్డు సీఈఓ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటీ..? భారీ నష్టం తప్పదని తెలిసినా.. సీఏ వెనకడుగు వేయడానికి గల కారణాలేంటీ.. ? అంటే.. వీటన్నింటికి సమాధానం ఒక్కటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించడం అసాధ్యం..! అంటే ఈ ఏడాది మెగా ఈవెంట్ లేనట్లేనని స్పష్టంగా తెలిసిపోతున్నది..!!
మెల్‌బోర్న్: టీ20 వరల్డ్‌కప్‌ను పోస్ట్‌పోన్ చేయడంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నాన్చుడు ధోరణీని అవలంభిస్తున్నా.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం చాలా క్లారిటీతో ఉంది. ఈ ఏడాది టోర్నీ జరిగే అవకాశాలు దాదాపుగా లేవని ఇన్‌డైరెక్ట్‌గా సంకేతాలిచ్చింది. అంటే ఇక వరల్డ్‌కప్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని చెప్పకనే చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం టోర్నీని నిర్వహించడం అసాధ్యమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా మొత్తం హై రిస్క్‌లో పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ‘షెడ్యూల్ ప్రకారం అక్టోబర్–నవంబర్‌లో వరల్డ్‌కప్ జరుగుతుందని ఇప్పటికీ ఆశతోనే ఉన్నాం. కానీ అలా జరుగుతుందని చెప్పడం మాత్రం చాలా పెద్ద రిస్క్‌తో కూడుకున్నది’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది సేమ్ విండోలో వరల్డ్‌కప్ నిర్వహించే చాన్స్ ఉంటే బాగుంటుందని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రాబర్ట్స్ ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే సీఏ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. వరల్డ్‌కప్‌పై తుది నిర్ణయం మాత్రం ఐసీసీదే. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వచ్చే నెల 10 వరకు ఆగాల్సిందే.
80 మిలియన్ ఆస్ర్టేలియన్ డాలర్లు నష్టం
మరోవైపు టోర్నీని నిర్వహించకపోతే భారీ మొత్తంలో నష్టపోతామని రాబర్ట్స్ వెల్లడించారు. దాదాపు 80 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టం వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటున్న తమకు ఇది మరింత పెద్ద దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏదో రకంగా టోర్నీని నిర్వహించాలంటే కరోనా వైరస్‌తో ఇబ్బందులు వస్తున్నాయి. 16 టీమ్‌లను ఆసీస్‌కు తీసుకొచ్చి క్వారంటైన్ చేయడం చాలా పెద్ద రిస్క్. ఒకవేళ టోర్నీ జరిగినా.. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అంటే ప్రేక్షకులను చాలా పరిమిత సంఖ్యలో అనుమతించాల్సి ఉంది. ఇది ఉన్నా లేకపోయినా.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు రెవెన్యూ వస్తుంది. కానీ ఇప్పుడు టోర్నీ ఫ్యూచరే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వివిధ రకాలుగా వచ్చే 20 మిలియన్ డాలర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు బయో సెక్యూర్ వాతావరణం కల్పించాలంటే అదనంగా మరో 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి. ఇవన్నీ లెక్కలేస్తే మేం మొత్తంగా 80 మిలియన్ డాలర్లు నష్టపోతున్నాం’ అని రాబర్ట్స్ వివరించారు. అంటే సీఈఓ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీ20 వరల్డ్‌కప్ విషయంలో సీఏ కూడా కాస్త వెనకడుగు వేసిందనే అర్థమవుతోంది.
పోస్ట్‌పోన్ చేయడమే బెటర్
కరోనా ముప్పు పొంచి ఉండడంతో టీ20 వరల్డ్‌కప్‌ను పోస్ట్‌పోన్ చేయడమే బెటర్ అని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ‘నాకు తెలిసి మిగిలిన దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా కరోనా వైరస్‌ను బాగా హ్యాండిల్ చేసింది. అందరికంటే ముందే బోర్డర్స్ క్లోజ్ చేసింది. అందుకే కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ వేర్వేరు దేశాలకు చెందిన 16 జట్లను ఒక్క చోటకు చేర్చడం కరెక్టు కాదు. వైరస్ వ్యాప్తికి దారి వేసినట్టు అవుతుంది. కొన్ని కేసులు చాలు దేశమంతా వ్యాపించడానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్ కప్ పోస్ట్‌పోన్ చేయడమే పెద్ద పాజిటివ్ విషయం’ అని ఓ ఇంటర్వ్యూలో మోర్గాన్ అన్నాడు.
ఇండియా సిరీస్‌కు ఒకే..
టీ20 వరల్డ్‌కప్‌పై పెద్ద ఇంట్రెస్ట్ చూపలేకపోతున్న సీఏ.. ఇండియా పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ సిరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తామని రాబర్ట్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్ ద్వారాపెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో… కొద్దిగానైనా ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడొచ్చని లెక్కలు వేసుకుంటోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతైనా మార్పు రాకపోతే.. వేదికల విషయంలో మార్పులు ఉంటాయని రాబర్ట్స్ సంకేతాలిచ్చారు. ‘ఇండియా టెస్ట్ సిరీస్‌కు చాలా టైముంది. అప్పటికల్లా డొమెస్టిక్ ట్రావెలింగ్‌కు అనుమతులిస్తారు. అలా కాకుండా తప్పనిసరి పరిస్థితులు ఎదురై, ప్రయాణానికి వీలు లేకపోతే ఒకటి లేదా రెండు వేదికల్లోనే సిరీస్‌ను పూర్తి చేస్తాం. ఈ సిరీస్ విషయంలో రకరకాల వాదనలు, ఊహాగానాలు, అంచనాలు ఉన్నాయి. కానీ ఇండియా టూర్‌తోపాటు ఈ సీజన్‌లో మిగిలిన సిరీస్‌ల నిర్వహణ విషయంలో మేం చాలా సానుకూలంగా ఉన్నాం. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు ఉన్నాయని మాకు తెలుసు. కానీ అనుకున్న ప్రకారం అన్ని నిర్వహించగలమని నమ్మకంగా ఉన్నాం’ అని రాబర్ట్స్ చెప్పుకొచ్చాడు.
For More News..