మేం నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి : TAFRC

మేం నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి :  TAFRC

ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ కాలేజీలు అధిక ఫీజులను వసూలు చేయడంపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నిర్ణయించిన ఫీజులు మాత్రమే కాలేజీలు తీసుకోవాలని సూచించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ JNTUH యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లతో  TAFRC ఛైర్మన్ సమావేశమయ్యారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలికి TAFRC సూచించింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని వెల్లడించింది. బీ కేటగిరి సీట్ల సంబంధించి TAFRCకి  ఫిర్యాదు చేసిన విద్యార్థుల దరఖాస్తులు ఆయా కాలేజీలు స్వీకరించడం లేదని పేర్కొంది. వెంటనే విద్యార్థుల నుంచి బీ కేటగిరీ సీట్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఫీజుల పెంపుపై సాధారణంగా మూడేళ్లకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహిస్తుంటుంది. 

ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ.. విద్యార్ధి సంఘ నాయకులు TAFRCకి వీడియోల ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచిందనే విషయాన్ని విద్యార్ధులు గుర్తు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపనకే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఫీజులు చెల్లించిన అనంతరం సమావేశాలు నిర్వహిస్తే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. సమావేశం అనంతరం అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలకు అధికారులు వెళుతారా ? అధిక ఫీజులు వసూలు చేసిన కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది వేచిచూడాలి.