ఫీజులపై అభ్యంతరం చెప్పిన కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ భేటీ

ఫీజులపై అభ్యంతరం చెప్పిన కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ భేటీ

కొన్నింటికి పెంచుకునేందుకు ఓకే

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు మరోసారి మారాయి. ఇప్పటికే రెండు సార్లు మార్చగా, తాజాగా కొన్ని కాలేజీల్లో అధికారులు మూడోసారి ఫీజులను ఫిక్స్ చేశారు. గతంతో పోలిస్తే పలు కాలేజీల్లో కొంత ఫీజు పెరిగింది. వీటిని ఖరారు చేయాలని కోరుతూ మంగళవారం సర్కారుకు టీఏఎఫ్ఆర్సీ ప్రపోజల్స్ పంపనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలుండగా.. వాటిలో 2022–25 బ్లాక్ పీరియడ్‌‌కు ఈ ఏడాది ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే జులై, సెప్టెంబర్ నెలల్లో ఆయా కాలేజీలతో హియరింగ్ నిర్వహించారు. టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులపై అభ్యంతరం చెప్పిన కాలేజీలతో సోమవారం మరోసారి అధికారులు భేటీ అయ్యారు. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్​రెడ్డి, విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఫీజుల కమిటీ ఏఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. హియరింగ్‌‌కు 25 కాలేజీలను పిలవగా.. కొన్ని కాలేజీలే హాజరయ్యాయి. ఆయా కాలేజీల లెక్కలను అధికారులు మరోసారి పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో ఫీజులు పెంచినట్టు అధికారులు చెప్తున్నారు. 

కొన్ని కాలేజీలు రాలే.. కొన్ని ఒప్పుకోలే

సోమవారం అనురాగ్, సీబీఐటీ, సీఎంఆర్, మల్లారెడ్డి కాలేజీలు, హైదరాబాద్ ఇన్‌‌స్టిట్యూట్, ఐఎస్ఎల్ కాలేజీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీ, ఎంఎల్ఆర్, మినా, నర్సింహారెడ్డి, శ్రీనిధి, వర్థమాన్, విద్యాజ్యోతి, నారాయణమ్మ తదితర కాలేజీలను హియరింగ్‌‌కు పిలిచారు. వీటిలో కొన్ని కాలేజీలు హియరింగ్‌‌కు అటెండ్​ కాలేదని తెలిసింది. వచ్చిన కాలేజీల్లో కొన్ని కాలేజీలు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులతో ఏకీభవించలేదని సమాచారం. అయితే, మేనేజ్‌‌మెంట్ల వాదనతో సంబంధం లేకుండా మంగళవారం 173 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను సర్కారుకు పంపించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.