ఆఫీసుకు రాలేని స్థితిలో ఉంటే.. MROనే వారింటికెళ్లి పని చేసిపెట్టింది

ఆఫీసుకు రాలేని స్థితిలో ఉంటే.. MROనే వారింటికెళ్లి పని చేసిపెట్టింది
  • బాధితురాలి ఇంటికే వెళ్లి ‘‘ధరణి’’ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన మల్యాల మండల తాహశీల్దార్ సుజాత 

జగిత్యాల జిల్లా: ఆఫీసుకు రాలేని పరిస్థితిలో ఉందని చెబితే ఫైల్ పక్కన పెట్టకుండా.. తాహశీల్దార్ మానవత్వంతో స్పందించింది. అనారోగ్యంతో ఉన్న పేషెంటు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసింది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా కన్నెత్తి చూడని ఎందరో అధికారులున్న ప్రస్తుత పరిస్థితుల్లో మల్యాల మండలం తహసీల్దార్  డి. సుజాత శభాష్ అని అభినందనలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన దొనకొండ కమల తన 20 గుంటల భూమిని అనారోగ్యo చికిత్స కోసం అమ్ముకుంది. రిజిస్ట్టేషన్ ఆఫీసులో స్లాట్ బుక్ చేయగా ఈరోజు సోమవారం 5వ తేదీ, 2021 రోజున రిజిస్ట్రేషన్ చేసుకునేలా అపాయింట్ మెంట్ కన్ఫం అయింది. కమల  జగిత్యాల్లోని ఓ వైద్యుని ఇంట్లో వంట మనిషిగా పనిచేసేది. భర్త దొనకొండ పోచయ్య 10 సంవత్సరాల క్రితమే చనిపోయారు. వీరికి ఐదుగురు బిడ్డలు. అయితే కమల ప్రస్తుతం నడవలేని స్థితిలో  ఆక్సిజన్ పై ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కమల పరిస్థితి గురించి తెలుసుకున్న మల్యాల తహశీల్దార్ సుజాత  జగిత్యాల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ కమల  వద్దకు ల్యాప్టాప్ తీసుకుని.. ఆపరేటర్ తో  సహా వెళ్లింది. మానవతా దృక్పథంతో అక్కడే ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. తహశీల్ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్న ఎందరో అధికారులకు ఓ చెంపపెట్టులా నిలుస్తోంది.