గ్లోబల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆసియా ఈక్విటీ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశాన్ని తైవాన్ అధిగమించింది. దీంతో ప్రపంచంలోని టాప్-5 అతిపెద్ద స్టాక్ మార్కెట్ల జాబితాలోకి తైవాన్ దూసుకెళ్లగా.. భారత్ ఒక అడుగు వెనక్కి వేసి 6వ స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం తైవాన్ మార్కెట్ క్యాప్ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ప్రభంజనంతో పాటు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఈ భారీ మార్పుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
తైవాన్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి ఆ దేశానికి చెందిన 'తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ' (TSMC) ఒక్కటే ముఖ్య కారణంగా నిలిచింది. గ్లోబల్ ఏఐ టెక్నాలజీకి అవసరమైన అడ్వాన్స్‌డ్ చిప్స్ తయారీలో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్లు 49 శాతం లాభపడ్డాయి. తైవాన్ ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లో ఈ ఒక్క కంపెనీ వాటాయే 42 శాతానికి పైగా ఉంది.
మరోవైపు 2024 సెప్టెంబర్ నుండి భారత స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి కీలక సూచీలు దాదాపు 5 శాతం వరకు క్షీణించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిరంతరం నిధులను ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల బలహీనమైన క్వార్టర్లీ రిజల్ట్స్ భారత మార్కెట్‌ను దెబ్బతీశాయి.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల పరంగా చూస్తే.. అమెరికా 77.96 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా 15.57 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 8.67 ట్రిలియన్ డాలర్లు, హాంకాంగ్ 7.26 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగి ఉన్నాయి. ఇప్పుడు తైవాన్ 5వ స్థానాన్ని ఆక్రమించగా.. భారత్ 6వ స్థానానికి పడిపోయింది.
