ప్రభుత్వ స్కీములు జనంలోకి తీసుకెళ్లండి

ప్రభుత్వ స్కీములు జనంలోకి తీసుకెళ్లండి
  • తెలంగాణలో గుజరాత్ మోడల్ పార్టీ నిర్మాణం: మీనాక్షి నటరాజన్
  • రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళనకు మూడు టాస్క్ లు: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్
  • త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు.. వాటితో లక్షన్నర పదవులు: వేం నరేందర్ రెడ్డి
  • గాంధీభవన్​లో పీసీసీ అబ్జర్వర్లతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టని ఎన్నో సంక్షేమ పథకాలను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే అమలు చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె కోరారు. బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లాల అబ్జర్వర్ల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కుల గణన సర్వే పూర్తి చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిందని, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుందని, పేదలకు సన్న బియ్యం పంపిణీ కొనసాగుతున్నదని వీటన్నింటిని నిజమైన లబ్ధిదారులకు అందించడంతో పాటు ఈ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని చెప్పారు. తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని గుజరాత్ మోడల్ లో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆమె ప్రకటించారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పాటు సీరియస్ గానే ఉందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బూత్ ల వారీగా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ పదవుల్లోను, అబ్జర్వర్ల పదవుల్లోను మహిళల ప్రాతినిథ్యం పెరగాలని కోరారు.

ఏప్రిల్​ 25  నుంచి మే 20 వరకు టాస్క్​మీటింగ్​లు​

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ అబ్జర్వర్లుగా మీకు ఇచ్చిన బాధ్యత చాలా కీలకమైందని, దీన్ని పార్టీ పటిష్టతకు, సంస్థాగత నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు టాస్క్ లతో పార్టీని ప్రక్షాళన చేయాలని పీసీసీ నిర్ణయించిందన్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు మొదటి టాస్క్ లో జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతాయని అన్నారు. దీనికి బ్లాక్, మండల స్థాయి అధ్యక్షులను ఆహ్వానించాలన్నారు. 

రెండో టాస్క్ సమావేశాలు వచ్చే నెల 4 నుంచి 10 వరకు జరగనున్నాయని, ఇందులో అసెంబ్లీ స్థాయి సమావేశాలు జరుగుతాయని, ఇందులో మండల, బ్లాక్ కమిటీల ఆఫీసు బేరర్లను ఆహ్వానించాలని సూచించారు. మూడో టాస్క్  సమావేశాలు వచ్చేనెల 13 నుంచి 20 వరకు సాగుతాయని, ఇవి మండల స్థాయిలో జరుగుతాయని, ఇందులో గ్రామ స్థాయి అధ్యక్షులను ఆహ్వానించాలని కోరారు.

అబ్జర్వర్ల రిపోర్టు ఆధారంగానే మండల, జిల్లా అధ్యక్షుల నియామకం

 మొత్తం 35 జిల్లాలకు.. జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మంది పీసీసీ అబ్జర్వర్లను పీసీసీ నియమించింది. వీరంతా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విస్తృతంగా పర్యటించి, పార్టీ కార్యకర్తలను కలుసుకుంటారు. అక్కడ పార్టీ పరిస్థితి తెలుసుకొని మండల, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందని ఆరా తీస్తారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి మూడు పేర్లను, మండల కమిటీ అధ్యక్ష పదవికి ఐదు పేర్లను సిఫారసు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ నిర్ణయం పీసీసీ చీఫ్, పార్టీ ఇన్​చార్జ్ కలిసి తీసుకోనున్నారు. అలాగే పార్టీ పరిస్థితిపై పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.

తెలంగాణ రోల్​మోడల్​గా నిలవాలి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయని, వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు దాదాపు లక్షన్నర పదవులను తమ ప్రభుత్వం భర్తీ చేయనుందని, ఇంత పెద్ద మొత్తంలో పదవులు కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కనున్నాయని చెప్పారు. పార్టీని గ్రామ   స్థాయిలో బలోపేతం చేయాలని, సంస్థాగత నిర్మాణంలో కాంగ్రెస్ దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవాలని కోరారు.