మహబూబాబాద్, వెలుగు: మావోయిస్టులు జనజీవనస్రవంతిలో కలిసి కమ్యూనిస్టులతో కలసి పనిచేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం మహబూబాబాద్సీపీఐ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడడానికి వామపక్ష పార్టీలు ఏకమై పోరాటం సాగించాలన్నారు. అడవుల్లో మావోయిస్టులు సాయుధ పోరాట పంథాను వీడి కొత్త పంథాలో వామపక్షాలతో కలిసి పనిచేయాలన్నారు.
దేశంలో ఓట్ల చోరీ చేసి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఓట్ల చోరీ కాకుండా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయేదన్నారు. బీహార్లో ఓటమి అంచుల్లో బీజేపీ కూటమి ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కే తమ మద్దతు ఉందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో 5 లక్షల మందితో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అజయ్ సారధి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు
